
బాల్య వివాహాలు చేస్తే చర్యలు
● ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి
అనకాపల్లి: జిల్లాలో బాల్య వివాహాలు అరికట్టడంలో బాల్య వివాహ రహిత కమిటీని 11 మంది సభ్యులతో నియమించామని, 18 ఏళ్లలోపు వారికి వివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.సూర్యలక్ష్మి తెలిపారు. శుక్రవారం స్థానిక గవరపాలెం బాలికోన్నత పాఠశాలలో బాల్య వివాహ రహిత వార్డు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 గురించి వివరించారు. దీనిపై అవగాహన కలిగి ఉండాలని కమిటీ సభ్యులకు సూచించారు. ప్రతి బాలిక చదువుకునేటట్టు ప్రోత్సహించాలని, తల్లిదండ్రులకు చట్టాల పట్ల అవగాహన కల్పించాలని కోరారు. ఎమర్జెన్సీ సమయంలో 112, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, ఉమెన్ హెల్ప్‌లైన్ 108, 100కి కాల్ చేసే విధంగా తల్లిదండ్రులకు పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో 81వ వార్డు కార్పొరేటర్ పీలా లక్ష్మీసౌజన్య, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సీహెచ్ వంశీప్రియ, గ్రామ రెవెన్యూ ఆఫీసర్ జి. ప్రసాద్, హెచ్‌ఎం పి.జగన్నాథరావు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.