మాకవరపాలెం: రాచపల్లి రెవెన్యూలోని 737 సర్వే నంబర్‌లో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టారు. యరకన్నపాలేనికి, యలమంచిలి మండలం పెదపల్లికి మధ్యలో ఇటీవల మట్టిరోడ్డు వేసిన సంగతి తెలిసిందే. ఫారెస్ట్ భూమిలో రోడ్డు వేస్తున్నారంటూ కోటవురట్ల సెక్షన్ అధికారి వివేకానంద పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గురువారం నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్ పరిశీలించి, ఈ రోడ్డు వేయడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. కానీ అనుమతులు ఎవరు ఇచ్చారు, ఏ నిధులతో వేస్తున్నారో తెలపాలని మీడియా ముఖంగా అధికారులను ప్రశ్నించారు. దీంతో శుక్రవారం ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా 737 సర్వే నంబర్ భూమిపై సర్వే ప్రారంభించారు. రెవెన్యూ విభాగం జిల్లా సర్వే ఏడీ గోపాలకృష్ణ, ఆర్డీవో వి.వి.రమణ సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ 737 సర్వే నంబర్‌లో మొత్తం 1605 ఎకరాల భూమి ఉందన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ మ్యాప్‌లు, రికార్డుల ఆధారంగా పూర్తిస్థాయి సర్వే చేపట్టి సరిహద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. అయితే జంగిల్ అధికంగా ఉన్న కారణంగా కొంత సమయం పడుతుందన్నారు. సర్వే పూర్తి చేసి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటరమణ, నర్సీపట్నం ఫారెస్ట్ రేంజర్ రాకేష్ కుమార్, కోటవురట్ల సెక్షన్ అధికారి వివేకానంద, బీట్ అధికారి నూకరాజు, వీఆర్వోలు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.
సంయుక్తంగా సర్వే చేపట్టిన ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు
సర్వే అనంతరం వివరాలు వెల్లడిస్తామన్న ఏడీ గోపాలకృష్ణ