
అమ్మకానికి అంగన్‌వాడీ పోస్టు
● రూ.4 లక్షలు ఇచ్చిన వారికే ఉద్యోగం ● అర్హత ఉన్నా అన్యాయం చేశారు ● బాధితురాలు సునీత ఆరోపణ ● వరుసగా రెండో రోజు రిలే నిరాహార దీక్ష ● తిమ్మరాజుపేట అంగన్‌వాడీ పోస్టుకు ఎస్సీ రిజర్వేషన్ ● అర్హత లేనివారిని నియమించారని బాధితురాలి ఆవేదన
సాక్షి, అనకాపల్లి: కూటమి నేతలు అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తమకు ఎవరు డబ్బులిస్తే వారికే ఉద్యోగమంటూ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట అంగన్‌వాడీ హెల్పర్ పోస్టును అన్ని అర్హతలు, మెరిట్ ఉన్నా తనకు రాకుండా చేశారని స్థానిక ఎమ్మెల్యే సోదరుడిపై దళిత మహిళ మంత్రి సునీత ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం చేయాలంటూ అచ్యుతాపురంలో బుధవారం నుంచి ఆమె రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ పోస్టును దళితులకు కేటాయించారని, మెరిట్, అర్హత ఉన్న తనకు కాకుండా.. స్థానిక జనసేన ఎమ్మెల్యే సోదరుడు రూ.4 లక్షలకు ఉద్యోగాన్ని అమ్ముకున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. బీసీ కులానికి చెందిన కోడలికి ఈ ఉద్యోగం అమ్ముకున్నారని, తనకు న్యాయం జరిగే వరకూ పోరాడతానని బాధితురాలు స్పష్టం చేశారు.
సునీతకే గ్రామస్తుల మద్దతు
తిమ్మరాజుపేట గ్రామ అంగన్‌వాడీ హెల్పర్ అనారోగ్యం కారణంగా మరణించడంతో ఆ పోస్టుకు గత ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ వచ్చింది. గతంలో బీసీ రిజర్వేషన్ ఉన్న ఈ హెల్పర్ ఉద్యోగానికి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించారు. ఈ పోస్టుకు అదే గ్రామానికి చెందిన ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు. మెరిట్ ఆధారంగా అన్ని అర్హతలున్న మంత్రి సునీతకే ఈ పోస్టు కేటాయించాలని సర్పంచ్‌తోపాటు టీడీపీ, జనసేన పార్టీ నాయకులు ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ దగ్గరకు వెళ్లి సిఫారసు చేశారు. దీనికి ఎమ్మెల్యే అంగీకారం కూడా తెలిపారు. దీంతో సునీతతోపాటు ఆమె కుటుంబం కూడా తమకే ఈ ఉద్యోగం వస్తుందనే ఆశతో ఉన్నారు. అయితే మరో మహిళను ఈ పోస్టులో నియమించారు. ఎస్సీ రిజర్వేషన్‌కు కేటాయించిన పోస్టును బీసీలకు ఇచ్చారంటూ తిమ్మరాజుపేట అంబేద్కర్ విగ్రహం వద్ద సునీత రిలే నిరాహార దీక్ష ప్రారంభించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు
అన్ని అర్హతలు, మెరిట్ ఉన్నా దళిత కులానికి చెందిన తనకు ఉద్యోగం రాకుండా స్థానిక ఎమ్మెల్యే సోదరుడు అడ్డుకున్నాడంటూ మంత్రి సునీత ఈనెల 14వ తేదీన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆ ఫిర్యాదును ఐసీడీఎస్ పీడీకి అప్పగించారు. పీడీ ఆదేశం మేరకు యలమంచిలి ఐసీడీఎస్ అధికారులు తిమ్మరాజుపేట గ్రామానికి వెళ్లి విచారణ చేసి కలెక్టర్ నివేదిక అందజేశారు.