
మా పిల్లలకు చదువు చెప్పండి సారూ..
● కలెక్టర్ కార్యాలయం వద్ద చిన్నారులు, గిరిజనులు ఆందోళన
కోటవురట్ల: మా ఊర్లో ప్రభుత్వ పాఠశాలను పెట్టండి.. రాకపోకల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం.. మా ఊరికి రోడ్డెయ్యండి అంటూ గిరిజనులు ఆందోళన బాట పట్టారు. గొట్టివాడ శివారు అణుకు గిరిజన గ్రామస్తులు సీపీఎం ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సీపీఎం నాయకులు, గిరిజనులు తమ ఆవేదనను వినిపించారు. పీటీజీ కోందు తెగకు చెందిన 50 కుటుంబాలు అణుకులో నివసిస్తున్నాయని, మెయిన్‌రోడ్డు నుంచి తమ గ్రామానికి రావాలంటే గోతులు, గెడ్డలు, బండరాళ్లను దాటుకుని ఆరు కిలోమీటర్లు నడవాలన్నారు. గత ప్రభుత్వంలో గ్రావెల్ రోడ్డు నిర్మించగా, వర్షాల కారణంగా రోడ్డు మొత్తం శిథిలమైందని, దాంతో నడక కూడా నరకప్రాయమే అన్నారు. గర్భిణులు, వ్యాధులతో బాధపడేవారు, బడికి వెళ్లే చిన్నారులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు బడికి వెళ్లాలంటే రానుపోను 16 కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని, దాంతో చాలా మంది బడి మానేసి ఇంటికే పరిమితమవుతున్నారని తెలిపారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి తారు రోడ్డు వేసి, గ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదిర్శ జి.డేవిడ్‌రాజ్, గిరిజనులు మర్రి సూరిబాబు, తాంబేళ్ల సూరిబాబు, గెమ్మెల సురేష్, కొర్రా రాజుబాబు, గెమ్మెల సత్తిబాబు, పాంగి ఆశ, తాంబెళ్ల కవిత, గెమ్మెల బంగారమ్మ, తాంబేళ్ల లక్ష్మి, మర్రి చిలుకుచింత పాల్గొన్నారు.