
వీధి దీపాల మాదిరిగా బెల్టు దుకాణాలు
వీధి దీపాల మాదిరిగా విస్తరించిన బెల్ట్ షాపులను తక్షణమే నిలిపివేసి కల్లుగీత కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గీత కార్మికులు కలెక్టరేట్ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. గ్రామాల్లో కళకళలాడే కల్లు దుకాణాలు పోయి కూటమి ప్రభుత్వంలో బెల్టు దుకాణాల ద్వారా కల్తీ మద్యం ఏరులై పారుతుందని విమర్శించారు. జిల్లాలో 3 వేల బెల్టు షా పుల ద్వారా గోవా, యానాం మద్యాన్ని విక్రయిస్తున్నారని ఆరోపించారు. వృత్తిని నమ్ముకుని ప్రాణాలకు తెగించి చెట్లు ఎక్కుతూ కుటుంబాలను పోషించుకుంటున్న గీత కార్మికుల పొట్ట కొట్టొదన్నారు. గుడి, బడి, చర్చి, దేవాలయాలు తేడా లేకుండా రేయింబవళ్లు మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారు. తాటికల్లును కేరళ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయన్నారు. మన రాష్ట్రంలో మాత్రం బీరు, బ్రాందీ, విస్కీలను ప్రోత్సహిస్తూ లక్షలాది గీత కార్మికుల కుటుంబాల ఉపాధిని దారుణంగా దెబ్బతీసిందని నాయకులు గంటా శ్రీరామ్, గోకాడ దేముడు, యర్రా దేముడు, బత్తిన నాగేశ్వరరావు, గండిబోయిన రాము విమర్శించారు. బెల్టు షాపులు తొలగించేందుకు వీఆర్‌ఏ, సచివాలయ పోలీసు, సర్పంచ్, ఎంపీటీసీలతో గ్రామ కమిటీలు వేయాలన్నారు. బెల్ట్ షాపులు పెట్టిన పంచాయతీల్లో సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలంటూ పలు డిమాండ్లుతో కూడిన వినతిపత్రం అందజేశారు.
● మా పొట్ట కొట్టొద్దని కల్లు గీత కార్మికుల ఆందోళన