
ఉపాధి పనుల్లో కుల వివక్ష..
టీఏ తీరుపై దళిత మహిళల నిరసన
ఉపాధి హామీ పథకం టీఏ తీరుపై వడ్డాది గ్రామ వేతనదారుల నిరసన
కులాల ప్రాతిపదికన ఉపాధి పనులు కల్పించడంతో తమకు తక్కువ వేతనం వస్తుందని, టీఏ వి.రమణపై విచారణ చేసి న్యాయం చేయాలంటూ బుచ్చెయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన దళిత మహిళలు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు భూసి కోటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన చేశారు. ప్రభుత్వం కల్పించిన క్యూబిక్ మీటర్ లెక్కలు కాకుండా అధికంగా పనిచేయిస్తూ మండుటెండల్లో సైతం మహిళా దళిత కూలీలను ఉంచుతున్నారని వాపోయారు. చేసిన పనికి సరైన వేతనం దక్కకుండా చేస్తున్నారన్నారు. అతని తీరుపై మండల స్థాయి అధికారులు వచ్చి మందలించారని, అయినా మార్పు లేదని వాపోయారు. అతని తీరుపై ప్రశ్నించినందుకు వారం రోజుల పాటు 196 మంది వేతనదారులకు పని నిలిపివేసి రకరకాల సాకులతో ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. జిల్లా అధికారులు విచారణ చేపట్టి అతనిపై చర్యలు తీసుకుని, సరైన వేతనం చెల్లించాలని కోరారు.