
చెస్ పోటీల విజేతలు భవన్, శ్రావ్యశ్రీ
విశాఖ స్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి అండర్–15 చదరంగం చాంపియన్‌షిప్‌ను కె.భవన్ (ఓపెన్ విభాగం), శ్రావ్యశ్రీ (బాలికల విభాగం) కై వసం చేసుకున్నారు. ఆల్ విశాఖ చెస్ సంఘం ఆధ్వర్యంలో బీవీకే కళాశాలలో ఈ పోటీలు జరిగాయి. ఓపెన్ విభాగంలో 200 మంది బాలురు, బాలికల విభాగంలో 99 మంది ఏడేసి రౌండ్ల పాటు జరిగిన ఈ పోటీల్లో తలపడ్డారు. ఓపెన్ విభాగంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన భవన్ ఆరున్నర పాయింట్లతో విజేతగా నిలిచాడు. హర్ష కీర్తన, వినీల్ కార్తీక్, టి.నిశ్చల్ ఆరేసి పాయింట్లతో పోటీ ముగించారు. బాలికల విభాగంలో అనకాపల్లి జిల్లాకు చెందిన శ్రావ్యశ్రీ ఆరున్నర పాయింట్లతో విజేతగా నిలిచింది. శివసాయి దివ్య, ఆఫ్షీన్, గురువర్షిణి ఆరేసి పాయింట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఆయా కేటగిరీల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. వీరంతా నవంబర్ 2వ తేదీ నుంచి ఉత్తరప్రదేశ్‌లో జరిగే జాతీయ అండర్–15 చదరంగం చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.