
స్మార్ట్ మీటర్లు తొలగించకుంటే భారీ ఆందోళన
మునగపాక: రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను తొలగించకుంటే రైతులతో కలిసి భారీ ఆందోళన చేపడతామని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు హెచ్చరించారు. మండలంలోని వెంకటాపురంలో వ్యవసాయ క్షేత్రాల్లో ఏర్పాటు చేసిన స్మార్ట్‌మీటర్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించడంతో రైతులకు రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకు విద్యుత్ బిల్లులు వస్తాయన్నారు. రైతులు గగ్గోలు పెడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్‌మీటర్లను ఏర్పాటు చేస్తుందన్నారు. ఒక్కో మీటరుకు రూ.13వేలు చొప్పున రైతుల నుంచి వసూలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ.. స్మార్ట్‌మీటర్లను వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచన చేసి స్మార్ట్ మీటర్ల తొలగింపు చేపట్టాలని, లేకుంటే రైతులతో కలిసి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ, రైతులు కడియం కృష్ణ, గోవిందరావు, సుందరపు అప్పలరాజు, నీలకంఠారావు, చిన్ని అప్పారావు, మహాలక్ష్మీరావు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.