
నిండు గర్భిణికి తప్పని డోలీమోత
● ఆలస్యంగా వచ్చిన అంబులెన్స్ ● మార్గంలో తుప్పల్లోనే ప్రసవించిన గర్భిణి
రోలుగుంట : మండలంలో గిరిజన గ్రామాలకు రహదారి సమస్య తీరక రవాణా సమస్యతో అర్ల గ్రామం నుంచి దిగువకు ఆస్పత్రికి డోలీమోతతో తీసుకొస్తున్న గర్భిణి మార్గంలోనే ప్రసవించిన సంఘటన ఆదివారం జరిగింది. అర్ల గ్రామానికి చెందిన పాంగి సాయికి నెలలు నిండి నొప్పులు రావడంతో ఆమె భర్త సుందర్రావు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి కుటుంబ సభ్యులతో కలిసి భార్యను కొండ డిగువకు డోలీమోతతో నాలుగు కిలోమీటర్లు వై.బీ.పట్నం రోడ్డు వరకూ మోసుకుని వచ్చారు. అంబులెన్సు రావడం ఆలస్యం కావడంతో తోటి మహిళలు మార్గంలో తుప్పల్లోకి తీసుకెళ్లగా అక్కడే ప్రసవం జరిగింది. తరువాత అంబులెన్సు రావడంతో ఆమె బంధువులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు మాట్లాడుతూ గిరిజనుల సమస్య పరిష్కారంలో తగిన చర్యలు తీసుకోని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. లోసింగి, పెదగరువు , పీత్రుగెడ్డ తదితర గ్రామాల్లో పీవీటీజీ తెగకు చెందిన గిరిజనుల నివాస గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో వైద్యం, విద్య, రవాణాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని, దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్‌కు, డీఈవో అప్పారావు నాయుడికి, పీవోకి ఫిర్యాదు చేశామన్నారు. దీంతో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, డీఈవో అప్పారావునాయుడు ఫిబ్రవరిలో ఆయా గ్రామాలు సందర్శించి సమస్యలు తెలుసుకున్నారని, ఆశా వర్కర్‌ని, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తామని, అలాగే రోడ్డు సమస్య తీరుస్తామని హామీ ఇచ్చి వెళ్లారని తెలిపారు. అయితే సమస్యలు మాత్రం పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు. పాడేరు పీవో ఈ గ్రామాలు ఎందుకు సందర్శించడం లేదో అర్థం కావడం లేదని విమర్శించారు, ఇప్పటికై నా ఈ గ్రామాల రవాణా సదుపాయాలు మెరుగుపరిచి, గుర్తించిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండు చేశారు.