
కష్టాల్లో పీచు పరిశ్రమ
● ప్రభుత్వ ప్రోత్సాహం కరువు ● కొబ్బరి పీచుతో పలు ఉత్పత్తుల తయారీ ● విశాఖ నుంచి చైనాకు ఎగుమతి ● వందలాది మందికి ఉపాధి ● జిల్లాలో 34 పీచు పరిశ్రమలు, 20 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు ● విద్యుత్ సబ్సిడీ విడుదల చేయాలని కొబ్బరి పీచు యాజమాన్యాలు వినతి
కొబ్బరి పీచు పరిశ్రమలు నష్టాల బాట పడుతున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే విద్యుత్ సబ్సిడీతో పాటు ఇతర ప్రోత్సాహకాలు కరువయ్యాయి. కొబ్బరి పీచుతో తయారుచేసే ఉత్పత్తులు అనకాపల్లి జిల్లా నుంచి చైనాకు ఎగుమతి అవుతున్నాయి. విదేశాల్లో కొబ్బరి పీచు ఉత్పత్తులకు గిరాకీ ఉన్నా స్థానికంగా పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తగిన ప్రోత్సాహకాలు లేక యాజమాన్యాలు నష్టాలు చవి చూస్తున్నారు.
సాక్షి, అనకాపల్లి :
కొబ్బరి సాగు చేసే రైతు వృథాగా పడవేసే కొబ్బరి డొక్కులను పీచు పరిశ్రమలు కొనుగోలు చేసి వివిధ పీచు ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి. అయితే విదేశాల నుంచి తగిన గిరాకీ ఉన్నా..సరిపడా పీచు ఉత్పత్తులను ఎగుమతి చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఉన్న కొబ్బరి పీచు పరిశ్రమల యాజమాన్యం ప్రభుత్వం వచ్చే సబ్సిడీని, ప్రోత్సాహకాలను త్వరితగతిన అందించాలని కోరుతున్నారు. కొబ్బరి పీచుతో సోఫాసెట్లు, కార్పెట్లు, పరుపులు, తాళ్లు తయారు చేస్తారు. ఇలాంటి కొబ్బరి పీచు పరిశ్రమలు అనకాపల్లి జిల్లాలో యలమంచిలి, ఎస్.రాయవరం, రాంబిల్లి మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి. వీటి ద్వారా రైతులకు అదనపు ఆదాయం..స్థానిక మహిళలకు ఉపాధి కూడా కలుగుతుంది. పీచుకు డిమాండ్ ఉంది..రైతు నుంచి ముడి సరుకు సమృద్ధిగా ఉంది. కానీ పీచు తయారీకి ఖర్చు ఎక్కువవుతోంది. ప్రభుత్వాలు విద్యుత్ సబ్సిడీ కల్పించి పరిశ్రమలను ఆదుకోవాలని యాజమానులు కోరుతున్నారు.
చైనాకు ఎగుమతి..
అనకాపల్లి జిల్లా నుంచి చైనా దేశంతో పాటు చైన్నె, గుజరాత్, కోల్‌కత్తా లాంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. అనకాపల్లి జిల్లా నుంచి కొనుగోలు చేసి చైన్నె, విశాఖలో చైనాకు సంబంధించి ఏజెంట్ల ద్వారా పోర్టు నుంచి ఎగుమతి అవుతుంది. కొబ్బరి పీచుతో కృత్రిమ బొమ్మలు, ప్‌లైవుడ్, పరుపులు కూడా తయారు చేస్తారు.
15 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు..
అనకాపల్లి జిల్లాలో 15 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ఇక్కడ కొబ్బరి పీచు పరిశ్రమల ద్వారా నెలకు 10 టన్నుల పీచు, తాళ్లు ఉత్పత్తి చేస్తూ పరోక్షంగా 3 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. పీచు పరిశ్రమలకు అవసరమైన కొబ్బరి డొప్పలను ట్రాక్టర్ లోడు రూ.4వేల నుంచి, రూ.5 వేల వరకు, లారీలోడు రూ.7వేల నుంచి రూ.8 వేల వరకు చెల్లించి కొనుగోలు చేస్తారు. పీచు తయారీకి కిలోకు రూ.8 వరకు ఖర్చవుతుంది. మిగిలిన పొట్టును ఇటుకల బట్టీలకు విక్రయిస్తుంటారు. పరిశ్రమ వద్దకు తెచ్చిన డొక్కను పీచుగా మార్చడానికి కనీసం నెల రోజుల వ్యవధి పడుతుంది. ఇటీవల స్థానికంగా కూడా వీటి వినియోగం పెరగడంతో 30 శాతం ఉత్పత్తులను ఇక్కడే ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కొబ్బరి దిగుబడులు తగ్గడంతో కిలో ధర రూ.8 మాత్రమే ఉందని రైతులు పేర్కొంటున్నారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదాయంగా అందిస్తున్న కొబ్బరి పీచు తయారీని ప్రభుత్వం ప్రోత్సహించాల్సి ఉంది.
కొబ్బరి పీచును నిల్వ చేసుకునేందుకు గోదాముల ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని, రాయితీలు ఇవ్వాలని పరిశ్రమల యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఒక్కో కొబ్బరి కాయ నుంచి 80 గ్రాముల పీచు..
జిల్లాలో చిన్నాపెద్ద కలిపి 34 కొబ్బరి పీచు పరిశ్రమలు ఉండగా.. సగటున 350 గ్రాముల బరువు ఉన్న ఎండు కొబ్బరి కాయ నుంచి 80 గ్రాములు పీచు వస్తే.. కొబ్బరి పొట్టు 160 గ్రాముల వరకు వస్తోంది. ఏడాదికి 6వేల టన్నుల పొట్టు ఉత్పత్తి అవుతోందని అంచనా. అధిక ఈసీ ఉన్న కొబ్బరి పొట్టును నేరుగా వినియోగిస్తే మొక్కలు దెబ్బతింటాయి. దీంతో వివిధ పద్ధతులలో ఈసీ శాతం తగ్గించి కంపోస్టుగాను, బ్రిక్స్ రూపంలో తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. ఈసీ ఎక్కువగా ఉన్న పొట్టును ఇటుక బట్టీలకు టన్ను రూ.2,500 చొప్పున విక్రయిస్తుండగా తక్కువ ఈసీ ఉన్న పొట్టును టన్ను రూ.5 వేలకు విక్రయిస్తున్నారు. కొబ్బరి పొట్టు నాణ్యమైన సేంద్రియ ఎరువుగా తయారైతే, దాని ధర పొట్టు రూపంలో టన్ను రూ.14 వేల నుంచి రూ.20 వేల వరకు ధర ఉంది.
జిల్లా వ్యాప్తంగా 34 పరిశ్రమలు
ప్రధానంగా ఎస్.రాయవరం, రాంబిల్లి, అచ్యుతాపురం, యలమంచిలిలో పరిశ్రమలున్నాయి
ఏడాదికి 6 టన్నుల పీచు తయారీ
కొబ్బరి తాళ్లు, నార, మ్యాట్‌లుగా తయారీ
సుమారుగా 3000 మంది ఉపాధి
12 వేల ఎకరాలకు పైగా కొబ్బరి తోటల సాగు
రాయితీ కల్పించాలి..
కొబ్బరి పీచు పరిశ్రమలు పరిస్థితి బాలేదు. అప్పుల ఊబిలో కూరుపోయాం. వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న కొబ్బరి పీచు పరిశ్రమలకు విద్యుత్ రాయితీ కల్పించాలి. జిల్లాలో మరిన్ని కొబ్బరి పీచు తయారీ పరిశ్రమలు ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. స్థానిక మహిళలకు ఉపాధి కలుగుతోంది.
– కోలా జగదీష్, యాజమాని, కొరుప్రోలు గ్రామం
పరిశ్రమలో కొబ్బరి పీచు నిల్వలు

కష్టాల్లో పీచు పరిశ్రమ