
‘యాత కులస్తులను అవమానిస్తున్న కూటమి ప్రభుత్వం’
అనకాపల్లి: ఉత్తరాంధ్రలో ఉన్న యాత కులస్తులకు కీలక రాజకీయ పదవులు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం అవమానిస్తుందని జిల్లా యాత సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెంకే మారేష్ విమర్శించారు. స్థానిక నాయుళ్లువీధి సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తరతరాలుగా యాత కులస్తులను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల వరకే వాడుకుంటున్నారని, యాత కులస్తులను రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి పరిచే ఏ చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఉత్తరాంధ్రలోని యాత కులస్తుల్లో అక్షరాస్యత శాతం చాలా తక్కువన్నారు. పేదరికం, నిరుద్యోగం వారిని పట్టి పీడిస్తున్నాయన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తుర్తి అప్పారావు మాట్లాడుతూ బీసీఏలో 54 కులాల నుంచి 32 కులాలను అత్యంత వెనకబడిన కులాలుగా గుర్తించి వారి జీవన విధానాన్ని మెరుగుపరుస్తామని జారీ చేసిన జీవో నంబర్ 17ను తక్షణమే అమలు చేయాలని కోరారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం మాదిరిగా ఏపీలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంబీసీలకు 15 శాతం రిజర్వేషన్ కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు కర్రి వెంకటరమణ, బత్తిని సత్యనారాయణ, ఒడిసెల సూరిబాబు, కట్ట అప్పారావు, రాముడు రమేష్, గేడి సంతోష్, తదితరులు పాల్గొన్నారు.