
అధిక వడ్డీలు ఆశ చూపి కుచ్చుటోపీ
పాయకరావుపేట: అధిక వడ్డీలు ఆశచూపి వందలాది మంది ప్రజల వద్ద రూ.లక్షల్లో అప్పులు చేశాడు. ఆపై తిరిగి చెల్లించకుండా కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి ఓ వ్యాపారి పరారయ్యాడు. ఈ సంఘటన మండలంలో సత్యవరంలో శనివారం చోటు చేసుకుంది. బాధితులు లబోదిబోమంటూ విలేకరుల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కథనం మేరకు.. సత్యవరం గ్రామానికి చెందిన పెదిరెడ్డి అప్పారావు కుమారుడు వెంకటేశ్వరరావు 30 సంవత్సరాలుగా గ్రామంలోనే భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నాడు. అతను తొలుత తునిలో బట్టల షాపు, తర్వాత శ్రీనివాస జ్యువెలరీ షాపు పెట్టుకుని పలువురు కొనుగోలుదారులను ఆకర్షించాడు. వారితో నమ్మకం పెంచుకుని కొన్ని సంవత్సరాలుగా అధిక వడ్డీలు ఆశ చూపి రూ.లక్షల్లో రుణాలు తీసుకున్నాడు. వారికి ప్రతి నెలా వడ్డీలు చెల్లించేవాడు. దాంతో తుని, సత్యవరం, మాసాహేబుపేట, పెదరాంభద్రపురం, మంగవరం, తదితర గ్రామాలకు చెందిన 200 మందికి పైగా మహిళలు, పురుషుల వద్ద ప్రాంసరీ నోటులు రాసి ఇచ్చి డబ్బులు తీసుకున్నాడు. వితంతు, దివ్యాంగులు, వృద్ధాప్య పింఛనుదారుల నుంచి వడ్డీలు ఆశ చూపించి ప్రతి నెలా డబ్బులు కాజేసేవాడు. బంగారు వస్తువులు ఇస్తానని కొంతమంది వద్ద, వడ్డీ ఇస్తానని మరి కొంతమంది వద్ద నమ్మించి రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు కాజేసినట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.25 లక్షల వరకు నమ్మించి కాజేశాడు. సత్యవరంలో రూ.15 కోట్ల వరకు డబ్బులు తీసుకున్నట్లు బాధితులు ప్రాంసరీ నోట్లు తెచ్చి చూపించారు. పరారైన వ్యక్తి రెండు నెలలుగా ప్రజలకు సమాధానం సక్రమంగా చెప్పకపోవడం, ఫోన్‌కు సమాచారం ఇవ్వకపోవడం, కనిపించకపోవడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు. వారం రోజులుగా వ్యక్తి కనిపించకుండా తునిలో బంగారం షాపు మూసివేసి ఉండటం గమనించి పలువురు బాధితులు లబోదిబోమంటున్నారు. ప్రజలను నమ్మించి మోసం చేసి పరారైన వ్యక్తి పెదిరెడ్డి వెంకటేశ్వరరావుపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని, దీనిపై హోంమంత్రి స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
సత్యవరంలో రూ.25 కోట్ల మేర మోసం
పరారైన వ్యాపారి వెంకటేశ్వరరావు
లబోదిబోమంటున్న బాధితులు

అధిక వడ్డీలు ఆశ చూపి కుచ్చుటోపీ