
రేపు కలెక్టరేట్ వద్ద కల్లు గీత కార్మికుల ధర్నా
మాడుగుల రూరల్: గ్రామాల్లో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన బెల్టు షాపులను తక్షణమే తొలగించి, గీత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్టు కల్లు గీత కార్మిక సంఘం మాడుగుల, చీడికాడ, మండలాలకు చెందిన అధ్యక్షుడు దొడ్డి నారాయణరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అక్రమ మద్యం గ్రామాల్లో ఏరులై పారుతుందన్నారు. ప్రతి గ్రామంలో గుడి, బడి, చర్చి, దేవాలయం అని చూడకుండా బెల్టు షాపులు ఏర్పాటు చేసి, మద్యం అమ్మకాలు సాగిస్తుందన్నారు. దీనివల్ల కల్లు విక్రయాలు జరగక, కల్లు గీత కార్మికులు ఉపాధి కోల్పోయారని, ఔషధ గుణాలు ఉన్న తాటికల్లును కేరళ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ, లక్షలాది గీత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రసాయనాలతో తయారు చేసిన మద్యాన్ని ప్రోత్సహిస్తూ గీత కార్మికుల ఉపాధిని దెబ్బతీసిందని విమర్శించారు. ఎకై ్సజ్ సర్కిల్స్ పరిధిలో రూ.లక్షల్లో బెల్టు షాపులను వేలం వేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 3 వేల బెల్టుషాపులను వెంటనే తొలగించి, వాటిని నిర్వహిస్తున్న సర్పంచ్‌ల చెక్ పవర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని కల్లు గీత కార్మికులు హాజరు కావాలని కోరారు.