
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి
రావికమతం: రోలుగుంట మండలం కంచుగుమ్మల గోపి దాబా వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డులో ఈ నెల 7న రాత్రి ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తాపడి తీవ్రంగా గాయపడిన యువకుడు నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం మృతి చెందాడు. బంధువులు కథనం మేరకు... రావికమతం మండలం టి.అర్జాపురం గ్రామానికి చెందిన ఆరి వెంకటేష్ (24) ఈ నెల 7న నర్సీపట్నం నుంచి తన స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో కంచుగుమ్మల దాటిన తర్వాత గోపి దాబా దగ్గర ఆర్‌అండ్‌బీ రోడ్డు పూర్తిగా పాడై గోతులు ఏర్పడ్డాయి. వీటిని తప్పించబోయి బైక్ అదుపు తప్పి బోల్తాపడి అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కొత్తకోట ఎస్‌ఐ శ్రీనివాస్ జీపులో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం బంధువులు మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం తరలించగా పరిస్థితి విషమించటంతో విశాఖ కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆర్థిక పరిస్థితి బాగోలేక పోవడంతో అక్కడ నుంచి అక్కడ శివాని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ నుంచి శనివారం నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో టి.అర్జాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య సహస్ర, రెండు సంవత్సరాల కుమారుడు రోహిత్ ఉన్నారు.