
దళిత భూముల కేసులో సీపీఎం, ప్రజాసంఘాల నాయకులకు ఊరట
● కేసును కొట్టేసిన కోర్టు
చోడవరం: దళిత భూముల వివాదం కేసులో సీపీఎం, ప్రజాసంఘాల నాయకులకు కోర్టులో ఊరట కలిగింది. ప్రజాసంఘాల నాయకులపై పెట్టిన కేసులను కొట్టేస్తూ చోడవరం అడిషినల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ సూర్యకళ శుక్రవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే...కె.కోటపాడు మండలం కె.సంతపాలెం గ్రామంలో 1970లో దళితులకు ఇచ్చిన 18 ఎకరాల అసైన్డ్ భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించుకోవడంతో బాధిత దళితులకు న్యాయం చేయాలంటూ 2018లో సీపీఎం, ప్రజాసంఘాల నాయకులు అప్పటి తహసీల్దార్‌ను ప్రశ్నించడంతో కేసు నమోదు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి.వెంకన్నతోపాటు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి యర్రా దేముడు, సిఐటియు మండల కార్యదర్శి జి.తాతాలు, ఈర్లె నాయుడుబాబులతోపాటు స్థానికులు నిమిడి తల్లి సింహాచలం, ఏగాటి లింగరాజులపై 352 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వాదనలు పూర్తికావడంతో ప్రజాసంఘాల నాయకులపై పెట్టిన కేసులను కొట్టివేస్తూ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు చెప్పారని న్యాయవాదులు సీతా వెంకటరావు, గండి నాయన్‌బాబు, గాడి ప్రసాద్ తెలిపారు.