
15 టన్నుల బియ్యం స్వాధీనం
● వ్యాన్‌లో కాకినాడ పోర్టుకు తరలిస్తుండగా పట్టివేత ● పీడీఎస్ బియ్యంగా అంగీకరించిన యజమాని
యలమంచిలి రూరల్ : యలమంచిలి మున్సిపాలిటీ నుంచి అక్రమంగా విదేశాలకు తరలించేందుకు కాకినాడ పోర్టుకు తీసుకెళ్లడానికి ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యాన్ని లోడు చేసిన వాహనాన్ని యలమంచిలి రూరల్ పోలీసులు గురువారం తెల్లవారుజామున స్వాధీనపర్చుకున్నారు. ఇందుకు బాధ్యులుగా తెరువుపల్లి న్యూ వెంకటేశ్వర రైసు మిల్లు యజమాని నక్కపల్లి మండలం చందనాడ గ్రామానికి చెందిన బాలం కొండబాబు, ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా బొరిగుమ మండలం జయంతగిరి గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్ సదారక్ హరిజన్‌లను అదుపులోకి తీసుకున్నారు. యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర విలేకరులకు తెలిపిన వివరాలివి. యలమంచిలి మున్సిపాలిటీ పరిధి తెరువుపల్లి న్యూ వెంకటేశ్వర రైసు మిల్లులో బుధవారం రాత్రి ఓడీ 10ఏఏ 5409 రిజిస్ట్రేషన్ నంబరు గల వ్యాన్‌లో చౌక దుకాణాల వ్యవస్థ ద్వారా పేదలకు సరఫరా కావాల్సిన సుమారు 15 టన్నుల బియ్యాన్ని 300 బస్తాల రూపంలో లోడ్ చేశారు. ఈ సమాచారాన్ని అందుకున్న కొందరు మీడియా ప్రతినిధులు, యలమంచిలి రూరల్ పోలీసులు రైసు మిల్లు వద్దకు చేరుకుని పరిశీలించగా అప్పటికే రేషన్ బియ్యాన్ని వ్యానులో లోడ్ చేసి తరలించడానికి సిద్ధం చేసిన విషయాన్ని గుర్తించారు. వ్యాన్‌లో తరలిస్తున్న బియ్యం పీడీఎస్ బియ్యంగా తమకు అనుమానం ఉందని,పోలీసు సిబ్బంది యజమానిని అడగ్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ చెప్పి వ్యాన్ డ్రైవర్‌ను అక్కడ్నుంచి పరారైపోమని చెప్పగా అతను వ్యాన్ తాళాలు పట్టుకుని పరారయ్యాడు. వాహనాన్ని స్వాధీనపర్చుకోవడానికి ప్రయత్నించిన పోలీసులకు రైసు మిల్లు యజమాని సహాయ నిరాకరణ చేశాడు. దీంతో పోలీసులు సుమారుగా నాలుగు గంటలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. రైసు మిల్లు యజమాని,మరొకరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొద్ది సేపటికి యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర సైతం రైసు మిల్లు వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో బియ్యం లోడుతో ఉన్న వ్యాన్‌ను యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రాథమిక విచారణ అనంతరం రైసు మిల్లు యజమాని వ్యాన్‌లో ఉన్నది చౌక దుకాణాల ద్వారా పంపిణే చేసే బియ్యంగా అంగీకరించాడు. దీనిపై కేసు నమోదు చేసిన అనంతరం ఈ సమాచారాన్ని పోలీసులు స్థానిక తహసీల్దార్‌కు అధికారికంగా అందజేశారు. ఈ మేరకు యలమంచిలి మండలం పౌరసరఫరాల డీటీ వ్యాన్‌లో ఉన్న బియ్యం బస్తాల్లో ర్యాండంగా మూడు కేజీల శాంపిళ్లను సేకరించి, పీడీఎస్ బియ్యమా? కాదా? అని నిర్ధారించడానికి జిల్లా పౌరసరఫరాల అధికారికి పంపించారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. యలమంచిలి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నా పౌరసరఫరాల శాఖ అధికారులు మామూళ్లకు తలొగ్గి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు బలంగా ఉన్నాయి.