
రేషన్ డిపోలు, పాఠశాలలు ఆకస్మిక తనిఖీ
● తూకం, సీల్ సరిగా లేని రేషన్ డిపోపై కేసు నమోదుకు ఆహార కమిషన్ సభ్యుడు ఆదేశాలు
అనకాపల్లి టౌన్ : పట్టణంలోని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు బి.కాంతారావు విస్తృతంగా గురువారం పర్యటించారు. పలు రేషన్ డిపోలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు తనిఖీలు నిర్వహించారు. గాంధీనగరంలో రేషన్ డిపోని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. గుండాల జంక్షన్‌లోని రేషన్ డిపోలో తూనిక యంత్రం లైసెన్స్, సీల్ సక్రమంగా లేని కారణంగా కేసు నమోదు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గవరపాలెం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు అందుతున్న పౌష్టికాహారాన్ని పరిశీలించి తగు సూచనలు చేశారు. మరో అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి పిల్లలకు అందించే పౌష్టికాహారం విషయంలో ఎటువంటి తప్పిదాలు చేయరాదని సూచించారు. గవరపాలెం పార్కుసెంటర్ పక్కన్న ఉన్న ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం రికార్డును తనిఖీ చేసి, లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు. వేల్పులవీధిలో ఉన్న టౌన్ గర్‌ల్స్ హైస్కూల్‌ను సందర్శించారు. మధ్యాహ్న భోజనం రుచి చూసి, సాంబారు పల్చగా ఉండడం చూసి నిర్వాహకులను హెచ్చరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్, లీగల్ మెట్రాలజీ, విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.