
సహచరుడి పాడె మోసిన స్పీకర్
నాతవరం: ఏఎంసీ మాజీ చైర్మన్ లాలం అచ్చిరాజు అంత్యక్రియల్లో స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొని కడ వరకు పాడె మోశారు. మండలంలో మర్రిపాలెం పంచాయతీ శివారు వెన్నలపాలెం గ్రామానికి చెందిన అచ్చిరాజు అనారోగ్యంతో మరణించాడు. సోమవారం ఆయన అంత్యక్రియల్లో స్పీకరు అయ్యన్నపాత్రుడు తన భార్య పద్మావతి, కుమారులు విజయ, రాజేష్‌లతో కలిసి పాల్గొన్నారు. శ్మశానం వరకు పాడె మోసి అచ్చిరాజుపై ఉన్న మమకారాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి తన వెంట నడిచిన వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు. టీడీపీ మండలాధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ మండల కోఆప్షన్ సభ్యుడు షేక్ రజాక్, ఏఎంసీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, మాజీ చైర్మన్ అడిగర్ల అప్పలనాయుడు, తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు లాలం కాశీనాయుడు, రాజాన వీర సూర్యచంద్ర, మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు, నేతల విజయకుమార్ పాల్గొన్నారు.