
సహకార సంఘాల రుణ వితరణ భేష్
● రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, గృహ నిర్మాణ శాఖమంత్రి పార్థసారథి
మాడుగుల రూరల్: డీసీసీబీ ద్వారా రూ.140 కోట్ల రుణాలు అందజేసి, 97 శాతం రికవరీ సాధించడం శుభ పరిణామని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో, స్థానిక డీసీసీబీ బ్రాంచి సారథ్యంలో మాడుగుల టీటీడీ కళ్యాణమండపంలో సోమవారం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రైతులకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఇందులో భాగంగా రైతులకు బకాయిపడ్డ రూ.1635 కోట్లు చెల్లించామని, పొగాకు రైతుల నుంచి 2 కోట్ల కిలోలను పొగాకు కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయించామని అన్నారు. డీసీసీబీ చైర్‌పర్సన్ కోన తాతారావు మాట్లాడుతూ సహకార రంగంలో గతంలో ఒక ఎకరానికి రూ.5 లక్షల రుణం అందిస్తే, ఇపుడు రూ.7 లక్షలకు పెంచామన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఎంతో అభివృద్ధి చేశామన్నారు. అనంతరం 120 మంది లబ్ధిదారులకు రూ.2.58 కోట్లు చెక్కులను, కారుణ్య నియామకం పొందిన వారికి నియామకపు ఉత్తర్వులు అందజేశారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్యబాబు, డీసీసీబీ సీఈవో వర్మ, జిల్లా వ్యవసాయాధికారి, నియోజకవర్గ ప్రత్యేకాధికారి బి.మోహన్‌రావు, డీసీసీబీ బ్రాంచి మేనేజర్ కె.మహేశ్వరావు, డీసీసీబీ డీజీఎం బొడ్డేడ శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, తహసీల్దార్ రమాదేవి, వెలుగు ఏపీఎంవో రమామణి పాల్గొన్నారు.