
అన్నదాత సుఖీభవ వర్తింపజేయాలి
●ఆర్డీవో కార్యాలయం వద్ద మోకాళ్లపై గిరిజనుల నిరసన
ఆర్డీవో కార్యాలయం వద్ద మోకాళ్లపై నిరసన తెలియజేస్తున్న గిరిజన రైతులు
నర్సీపట్నం: డీపట్టా భూములకు అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ రోలుగుంట మండలం పనసలపాడు, రావికమతం మండలం, గర్నికం, కొవ్వుగుంట, కొట్నాబెల్లి గిరిజనులు సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్ద మోకాళ్లపై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో 70 మంది గిరిజనులు, 16 మంది దళితులు జీడి, మామిడి తోటలపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. బ్యాంకు రుణాలు పొంది ఉన్నారన్నారు. గిరిజనులకు అన్యాయం చేసి స్థానికేతరులైన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పట్టాలు ఇచ్చారని విమర్శించారు. కలెక్టరుకు సైతం ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు లేవన్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో గిరిజనుల పేర్లు లేకుండా చేశారన్నారు. వెబ్ ల్యాండ్‌లో పేర్లు లేకపోవడంతో బ్యాంకు రుణాలు, ఎరువులు, విత్తనాలు ఇవ్వలేదన్నారు. అధిక వడ్డీలకు ప్రైవేటు రుణాలు తీసుకొని పంటలకు పెట్టుబడి పెడుతున్నారన్నారు. ఇప్పటికై నా ఆర్డీవో పరిశీలన చేసి అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేయాలన్నారు. అనంతరం ఏవో సుధాకర్‌కు వినతిపత్రం అందజేశారు. కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్. సూరిబాబు, గిరిజన సంఘం నాయకులు ఎస్ శంకర్రావు, నాగరాజు, గేమిలా చిన్నబ్బాయి, ఎద్దుల రాజు పాల్గొన్నారు.