
సెజ్ కాలనీలో ఆటిజం శిక్షణ కేంద్రం
అచ్యుతాపురం రూరల్: సెజ్ పునరావాస కాలనీలో ఆటిజం సపోర్ట్ శిక్షణ కేంద్రం ప్రారంభించనున్నట్లు యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ తెలిపారు. శనివారం ఆయనతోపాటు రాష్ట్ర సమగ్ర శిక్షణ ఆటిజం కేంద్రాల నిపుణులు శ్రీరామ్ కమల్ మనోజ్ ఇక్కడ కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటిజం శిక్షణ కేంద్రంలో ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఒకేషనల్ ట్రైనింగ్ శిక్షణ, లెర్నింగ్ సపోర్ట్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ మ్యాథ్స్ రోబోటిక్ ల్యాబ్స్, అడ్వాన్స్‌డ్ ఫిజియో, న్యూరో ఎబిలిటీ, రీహాబిలిటేషన్ థెరపీ అందిస్తారన్నారు. దివ్యాంగ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి హైడ్రో థెరపీ, ఈత కొలను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆటిజం, దివ్యాంగ విద్యార్థులకు శిక్షణ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల డిజిటల్ విద్య రాష్ట్ర రిసోర్స్ పర్సన్ బి.మహాలక్ష్మినాయుడు పాల్గొన్నారు.