
గిరి ప్రదక్షిణకు పటిష్ట ఏర్పాట్లు
● విశాఖ కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట: శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించే సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని సమన్వయంతో విజయవంతం చేద్దామని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరి ప్రదక్షిణకు 5–6 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన పోలీస్ బందోబస్తు, క్యూలు, రద్దీ ప్రదేశాల్లో తోపులాటలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రతి 200 మీటర్లకు ఒకటి చొప్పున 132 తాగునీటి పాయింట్లు, 500 మరుగుదొడ్లు, ఆరు కంట్రోల్ రూమ్‌లు, ఐదు చోట్ల పబ్లిక్ అడ్రస్ సిస్టం, 13 పార్కింగ్ ప్రాంతాలు, 50 ఉచిత బస్సు సర్వీసులు, 18 నెట్‌వర్కింగ్ ఆసుపత్రులకు అనుసంధానంగా 32 వైద్య శిబిరాలు, 18 అంబులెన్సులు సిద్ధం చేసినట్లు చెప్పారు. రద్దీ ప్రాంతాల్లో 190 ఎల్‌ఈడీ దీపాలు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం 9 జనరేటర్లు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా 9, 10 తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేత, అప్పుఘర్ వద్ద 5 బోట్లు, 60 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారని కలెక్టర్ వెల్లడించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యేలు రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, రమేష్‌బాబు, వంశీకృష్ణ, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తదితర ప్రజా ప్రతినిధులు సూచించారు.
మధ్యాహ్నం 2 గంటలకు ప్రచార రథం ప్రారంభం
దేవస్థానం ఈవో త్రినాథరావు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తొలిపావంచా వద్ద అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు ప్రచార రథాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఆ రోజు రాత్రి 10 నుంచి 11 గంటల మధ్యలో రథం ఆలయానికి చేరుకుంటుందని, స్వామి పవళింపు సేవ, ఇతర లాంఛనాల అనంతరం 10వ తేదీ ఉదయం 5 గంటలకు స్వామి దర్శనాలు ప్రారంభమవుతాయని చెప్పారు. దర్శనాలు సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి 5.30 నుంచి 7 గంటల వరకు కొనసాగుతాయని వెల్లడించారు. దేవదాయ శాఖ ఇన్‌చార్జి కమిషనర్ రామచంద్రమోహన్, సీపీ శంఖబ్రత బాగ్చి, డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.