
బోర్డు సమావేశంలో పలు అంశాలకు ఆమోదం
విశాఖ సిటీ: వీఎంఆర్డీఏ బోర్డు సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. సంస్థ చైర్‌పర్సన్ ప్రణవ్‌గోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిషనర్ విశ్వనాథన్‌తో పాటు బోర్డు సభ్యులు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఇందులో పలు అంశాలకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. మధురవాడ, మిథిలాపురి కాలనీ, మారికవలస, వేపగుంట, ఇతర ప్రాంతాల్లో పీపీపీ విధానంలో అపార్టుమెంట్ల నిర్మాణాలకు ఆమోదించింది.
●అనకాపల్లి జిల్లా కొత్తూరు గ్రామం సర్వే నెంబర్ 608/1పీలో ఉన్న 5.68 ఎకరాల విస్తీర్ణంలో రూ 5.35 కోట్ల వ్యయంతో పిల్లల కోసం సిటీ లెవెల్ పార్క్ నిర్మాణానికి ఆమోదించింది. ఇందులో ఆట స్థలం, యోగా చేసుకునేందుకు యోగా ముద్ర విగ్రహాలతో కూడిన నిర్దేశిత ప్రదేశం, జిమ్ పరికరాలు, యాంఫీ థియేటర్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్‌బాల్ కోర్టులు, స్కేటింగ్ రింక్, ఇతర సదుపాయాలు ఉండనున్నాయి.
●వేపగుంట–పినగాడి బృహత్తర ప్రణాళిక రహదారి అభివృద్ధికి పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ●బీచ్ రోడ్‌లోని వీఎంఆర్డీఏ పార్కులో రూ 2.50 కోట్లతో ప్రస్తుతమున్న స్కేటింగ్ రింక్ పక్కనే 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ క్రీడా పోటీల నిర్వహణకు, అంతర్జాతీయ పోటీలకు అనువుగా రాష్ట్రంలోనే మొట్ట మొదటి స్కేట్ బోర్డ్ పార్క్ నిర్మాణానికి ఆమోద ముద్ర వేశారు.