
తొలి అడుగు.. సమస్యల మడుగు..
● లంకవానిపాలెంలో ఎమ్మెల్యే బండారుకు సమస్యలు వివరించిన బాధితులు ● ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో సమస్యల వెల్లువ
కె.కోటపాడు: తెలుగుదేశం పార్టీ బుధవారం ప్రారంభించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో నాయకులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాది కాలంలో మూడు గ్యాస్ సిలిండర్లను విడిపించినా ఒక్క రూపాయి కూడా తన ఖాతాలో పడలేదని లంకవానిపాలెం గ్రామానికి చెందిన నౌడు రాము అనే మహిళ తెలిపారు. ఈ గ్రామంలో బుధవారం నిర్వహించిన ‘తొలి అడుగు’ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లిన బండారుకు గ్యాస్ సిలిండర్ల నగదు రాలేదని రాము ఫిర్యాదు చేశారు. అదే కుటుంబానికి చెందిన రైతు అప్పలనాయుడు తనకు అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సహాయం రాలేదని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సహాయాన్ని ఇవ్వనున్నట్లు బండారు నచ్చచెప్పారు.
గ్యాస్ ఏజెన్సీకి రాము సమస్య తెలిపి పరిష్కార చర్యలను తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామానికి చెందిన మహిళ ఇమంది కనకమహాలక్ష్మి తాను విమ్స్ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేయడం వలన తన భర్త చనిపోయినా వితంతు పింఛన్ రాలేదని, తన ఇద్దరు ఆడపిల్లలకు ‘తల్లికి వందనం’ డబ్బులు రాలేదని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామంలో ఆయిల్ మిల్లు ఖాళీ స్ధలం అన్యాక్రాంతం కాకుండా, గ్రామ అవసరాలకు వినియోగించుకునేలా చూడాలని కొరుపోలు దేముడమ్మ, చిన్నమ్మలు, రామకృష్ణ ఎమ్మెల్యే కోరారు. గ్రామానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు ఎండోమెంట్ భూమిగా రికార్డులలో ఉన్న ఈ స్ధలాన్ని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు. ఎండోమెంట్ అధికారిని రప్పించి ఈ సమస్యపై మాట్లాడనున్నట్లు వీరికి ఎమ్మెల్యే బండారు తెలిపారు. రాష్ట్ర కొప్పలవెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్, టీడీపీ మండల అధ్యక్షుడు రొంగలి మహేష్ తదితరులు పాల్గొన్నారు.