ఆప్కాస్ ఉద్యోగులకు ‘తల్లికి వందనం’ ఇవ్వాలి
అనకాపల్లి: చాలీచాలని వేతనాలతో బతుకులు నెట్టుకొస్తున్న ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్‌డ్ సర్వీసెస్(ఆప్కాస్) ఉద్యోగులకు తల్లికి వందనంతో పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని జీవీఎంసీ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో మంగళవారం యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ శాఖలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఇంజినీరింగ్ కార్మికులకు వేతనాలు పెంచాలని ఒక వైపు ఆందోళన చేస్తుంటే.. మరోవైపు సంక్షేమ పథకాల కోత వేయడం చూస్తుంటే ప్రభుత్వం చెప్పిన మాటా ఒక్కటి, చేసిన పని ఒక్కటిగా ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు వాయి బోయిన శేఖర్, సోమధుల వెంకట లక్ష్మి, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బంగారు రవి, ఎర్రంశెట్టి అప్పలరాజు, సింగంపల్లి అజయ్, శంకర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


