సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
అనకాపల్లి హైవేపై జలగలమదుం జంక్షన్ వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా
తాళ్లపాలెం ఏపీ గురుకుల పాఠశాలలో ఏర్పాట్లు పరిశీలించి, సూచనలిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్
కశింకోట: తాళ్లపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ విజయ కృష్ణన్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. సీఎం శనివారం ఉదయం 11 గంటల నుంచి తాళ్లపాలెం పంచాయతీ పరిధిలో పర్యటించనున్నారు. విశాఖ నుంచి హెలికాప్టర్‌లో ఉగ్గినపాలెం అమలోద్భవి హోటల్ వద్ద ఉన్న లేఅవుట్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గాన తాళ్లపాలెం చేరుకోనున్నారు. అక్కడ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల సందర్శించి, సంపద కేంద్రాన్ని పరిశీలిస్తారు. అనంతరం పంచాయతీ సమీపంలో వేదిక వద్ద బహిరంగ సభ జరగనుంది. దీన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఏర్పాట్లపై ఆయా ప్రాంతాలను సందర్శించి అధికారులతో సమీక్షించి పలు సూచనలిచ్చారు. ఎస్పీ తుహిన్ సిన్హా కూడా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. తాళ్లపాలెం కూడలి నుంచి నర్సీపట్నం వైపు రోడ్డుపై ఉన్న గుంతలను ఆగమేఘాలపై పూడ్చారు.
నేడు వాజ్‌పేయి విగ్రహావిష్కరణ
అనకాపల్లి టౌన్/అనకాపల్లి: దేశ రాజకీయాలలో తనదైన శైలితో ఆదర్శంగా నిలిచిన అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ నెల 20న స్ధానిక జాతీయ రహదారి జలగల మదుం జంక్షన్ వద్ద నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానల్ సభ్యుడు ఈర్లె శ్రీరామ్మూర్తి తెలిపారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపూడి పరమేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతాన్ని ఎస్పీ తుహిన్ సిన్హా పరిశీలించారు. సీఎం పర్యటనలో 1500మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన


