నాలుగు ఫ్లేవర్స్‌లో తాండ్ర తయారీ
● చెరకు రైతులకు తీయని వార్త..
ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి అంటారు చెరకు తాండ్రను రుచి చూసినవారు.. తాండ్ర అమ్మకాలు ఊపందుకుంటే సుగర్ ఫ్యాక్టరీలు మూతబడి డీలాపడ్డ చెరకు రైతులు తీపిని చవి చూస్తారు.. ఆర్‌ఏఆర్‌ఎస్ పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రయోగం అందరికీ మంచి విందును అందించనుంది. మామిడి తాండ్ర తరహాలో చెరకు తాండ్రను త్వరలో అందుబాటులోకి తెస్తామని ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సాక్షి, అనకాపల్లి: అధిక పెట్టుబడులతో ఆశించిన దిగుబడి లేక చెరకు రైతులు నష్టాల బాట పడుతున్నారు. వాతావరణ మార్పులు, ఇతర పరిస్థితుల కారణంగా పంట నష్టపోయి లాభాలార్జించలేని పరిస్థితిలో ప్రస్తుతం వారున్నారు. జిల్లాలో మిగిలిన ఏకై క గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో కూడా క్రషింగ్ నిలిచిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ స్థితిలో రైతులకు ఆపద్భాంధవుడిగా నిలిచే అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌లోని చెరకు పరిశోధన స్థానం తీపి కబురు చెప్పింది. ఆర్‌ఏఆర్‌ఎస్ పాలిటెక్నిక్ తృతీయ సంవత్సరం విద్యార్థుల బృందం చెరకు రసంతో తాండ్రను తయారు చేశారు. ఇది ఎంతో ఆరోగ్యకరమే కాక వినియోగదారులకు అతి తక్కువ ధరకే లభిస్తుంది. 250 గ్రాముల తాండ్ర తయారీకి రూ.150 నుంచి రూ.200 ఖర్చవుతోంది. ఇప్పటికే ఆర్గానిక్ బెల్లం ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఆర్‌ఏఆర్‌ఎస్.. అతి త్వరలో చెరకు తాండ్రను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.
ఎల్లప్పుడూ లభించే చెరకుతో తాండ్ర..
తాండ్ర అనే సరికి అందరికీ టక్కున గుర్తొచ్చేది మామిడి తాండ్ర. దీనిని తయారు చేయడానికి కావాల్సిన మామిడి కాయలు వేసవి సమయంలోనే అందుబాటులో ఉంటాయి. అన్ సీజన్‌లో మామిడి తాండ్ర కొనాలంటే కొన్నిసార్లు అధిక మొత్తంలో ధర చెల్లించాల్సి ఉంటుంది. సహజసిద్ధమైన మామిడి తాండ్ర సామాన్యులకు అందుబాటులో ఒక కిలో రూ.400 వరకు వెవెచ్చించాల్సి ఉంటుంది. అందుకే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే చెరకు రసంతో.. తక్కువ ధరకే తాండ్రను పాలిటెక్నిక్ విద్యార్థులు తయారు చేశారు. దీంతో ఒకవైపు రైతుకు గిట్టుబాటు ధర కల్పించినట్లుగా.. మరో వైపు వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన, ఆరోగ్యకరమైన చెరకు తాండ్రను అందించారు.
రసాయనాలు కలపకుండా..
నాలుగు ఫ్లేవర్స్‌లో చెరకు తాండ్రను తయారు చేస్తున్నారు. నిమ్మ, యాలకలు, అల్లం, పొడి చెరకు తాండ్రలు ఎంతో రుచికరంగా ఉంటాయని చెబుతున్నారు. లీటర్ చెరకు రసాన్ని తీసుకుని శుద్ధి చేసిన తరువాత 20–30 నిమిషాల వరకు మరిగించాలి. తరువాత సరిపడా మోతాదులో పెక్టిన్‌ను కలిపి.. 3 నుంచి 4 నిమిషాలపాటు మరిగించాలి. మరిగిన మిశ్రమాన్ని వెడల్పాటి నెయ్యి రాసిన పళ్లెంలో పోసి చల్లార్చాలి. ఐదున్నర నిమిషాల తరువాత ఆ మిశ్రమాన్ని సమాంతరంగా ఒకదాని మీద వేరొకటి వేసి పొరలుగా వేయాలి. చివరిగా ఈ పళ్లెంలో ఉన్న మిశ్రమాన్ని 2–3 గంటలపాటు చల్లారిన తరువాత కావాల్సిన పరిమాణంలో కత్తిరించుకుని ప్యాక్ చేసుకోవాలి. ఈ పద్ధతిలో ఎటువంటి రసాయనాలు కలపకుండా తాండ్ర తయారు చేస్తారు.
విద్యార్థులకు అభినందనలు
గిట్టుబాటు ధర లేక సుగర్ ఫ్యాక్టరీ మూతపడడంతో దిగాలుగా ఉండే చెరకు రైతుకు మేలు చేకూరేలా.. వినియోగదారులకు తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా చెరకు తాండ్రను తయారు చేసిన బృందానికి సర్వాత్రా ప్రశంసలు అందుతున్నాయి. డాక్టర్ బి.నాగేశ్వరరావు, అసిస్టెంట్ టీచింగ్ అసోసియేట్‌లు ముజామ్మిల్‌ఖాన్, ఇ.వసంత సాయికుమార్ నేతృత్వంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఎస్.దీప్తి గౌతమ్, దేవి, ఆర్.భవ్యశ్రీ, ఎ.దుర్గాసిరి, కె.శ్రావణి, పి.ధనలక్ష్మి, జి.రమ్య బృందాన్ని అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్త జగన్నాథరావు అభినందించారు.
ఆర్‌ఏఆర్‌ఎస్ పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రయోగం సక్సెస్
కొత్త రుచులు కోరే వారికి ఉత్సాహం.. చెరకు రైతులకు ప్రోత్సాహం
తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన
ప్రయోజనాలెన్నో..


