మొబైల్ పోయిందా.. ఈ నంబర్‌కు మెసేజ్ చేయొద్దు
అనకాపల్లి టౌన్: మీ ఫోన్ పోయిందా.. అయితే ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయండి. మీ ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ను మెసేజ్ చేయండి చాలు.. అంటూ జిల్లా పోలీసులు ఊదరగొట్టారు. వివరాలు 95052 00100 నంబర్‌కు పంపిస్తే మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి కనిపెడతామన్నారు. చాలా కనిపెట్టారు కూడా.. అయితే మంగళవారం ఫోన్ పోగొట్టుకున్న ఒకరు ఈ నంబర్‌కు మెసేజి పంపి కంగుతిన్నారు. వివరాలు పంపాక ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆ నంబర్‌కు కాల్ చేయగా.. రాంగ్ నంబర్ అని పెట్టేశారు. మళ్లీ చేసి ‘ఇది పోలీస్ ఐటీ కోర్ విభాగం నంబరేనా’ అని అడిగితే చిరాకు పడ్డారు. ఈ విషయం ‘సాక్షి’ దృష్టికి రావడంతో కారణమేమిటని ఆరా తీసింది. నంబర్ మారిందని, ఇకపై 93469 12007 నంబర్‌కు మెసేజి చేయాలని జిల్లా పోలీస్ ఐటీ కోర్ విభాగం పోలీసులు తెలిపారు. ఈ నంబర్‌ను ఎక్కువగా ప్రచారం చేయకపోవడంతో పాత నంబర్‌నే చాలామంది వినియోగిస్తున్నారు. కొత్త నంబర్‌కు ఏదైనా మొబైల్ ఫోన్ నుంచి ‘హాయ్’ అని మెసేజ్ చేస్తే పోలీస్ ఐటీ కోర్ టీం స్పందిస్తుంది. వివరాలు తీసుకొని సరికొత్త టెక్నాలజీతో ఫోన్ ఎక్కడుందో కనిపెడుతుంది.


