యోగాతో ఆరోగ్యం, దీర్ఘ కాలిక వ్యాధుల నివారణ
అనకాపల్లి: నిత్య జీవితంలో యోగా చేయడం వలన ఆరోగ్యంగా జీవించవచ్చని, వివిధ రకాలైన వ్యాధుల బారి నుంచి రక్షణ పొందవచ్చని, సంపూర్ణంగా, ప్రశాంతంగా జీవిస్తారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.బాలాజీ అన్నారు. యోగాంధ్ర –2025 కార్యక్రమంలో భాగంగా స్థానిక గవరపాలెం రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జిల్లా ఆయుష్ మాన్ భారత్ శాఖ ఆధ్వర్యంలో గురువారం యోగాసనాలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21న ప్రపంచ యోగా దినోత్సవం విశాఖలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కలగాలంటే ప్రతి ఒక్కరూ ఉదయం లేదా సాయంత్రం సమయంలో రోజుకు రెండు గంటలు యోగా చేయాలని ఆయన కోరారు. ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణారావు మాట్లాడుతూ కరోనా వంటి విపత్తుల తరువాత మానవ జీవితంలో యోగా ప్రాముఖ్యత కలిగిందని, ప్రాచీన కాలం నుంచి యోగాకు ఎంతో ప్రాధాన్యం కలిగి ఉన్నప్పటికీ కరోనా తరువాత దీనిపై ప్రజల్లో ఆసక్తి పెరిగిందన్నారు. చిన్ని పిల్లల నుంచి వృద్ధుల వరకూ వయస్సును బట్టి యోగాసనాలు వారివారి స్వగృహాల్లోనే చేసుకోవచ్చని పేర్కొన్నారు. అంతకుముందు యోగా గురువుల బి.అప్పారావు, దొర్రం నాయుడు, మంగియ్య పర్యవేక్షణలో యోగాసనలు చేశారు. వైద్య సిబ్బంది ఎన్టీఆర్ ఆస్పత్రి నుంచి రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ ఎం. శ్రీనివాసరావు, జిల్లా ఆయుష్‌శాఖ అధికారి డాక్టర్ కె.లావణ్య, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి శ్రావ్య శ్రీ, జిల్లాలో వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి
డాక్టర్ బాలాజీ


