
ఇక తిరగలేను.. ప్రాణం తీసుకుంటాను..
ముగ్గురు ఆడపిల్లలతో ఉన్న తనకు రెవెన్యూ అధికారులు తీవ్ర అన్యాయం చేశారని, కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోవడం లేదని, తనకు చావే శరణ్యమంటూ కలెక్టరేట్ వద్ద మాకవరపాలెం మండలం పైడిపాలెం గ్రామానికి చెందిన జవ్వాది తాతారావు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన తన ముగ్గురు ఆడబిడ్డలతో కలెక్టరేట్ వద్దకు పురుగుల మందుతో వచ్చారు. ‘నాకు, మా అమ్మకు కలిపి గ్రామంలో 82.5 ఎకరాల భూమి ఉంది. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆన్‌లైన్‌లో 4 సెంట్లు తొలగించేశారు. వీఆర్వో, ఎమ్మార్వో, ఆర్డీవో కా ర్యాలయాలతోపాటు కలెక్టరేట్‌కు కూడా తిరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. తొ లగించిన భూమిని రీసర్వేలో తిరిగి నమోదు చేస్తా మని జిల్లా సర్వేయర్ సైతం చెప్పి చేతులు దులుపుకున్నారు. కూలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే నేను ఇక తిరగలేను. ఇక్కడే చావాలని నిర్ణయించుకున్నాను. నాతోపాటు పురుగు మందు తెస్తే పోలీసులు తనిఖీలు చేసి సంచిలో ఉన్న బాటిల్ లాక్కున్నారు’ అని చెప్పాడు. తన బిడ్డలను చూసైనా అధికారులు చలించాలని, సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని కోరాడు.