
గ్రామాల సుస్థిర అభివృద్ధికి ఊతం
అచ్యుతాపురం: గ్రామాల సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఉన్నత్ భారత్ అభియాన్ ఒకటి. ఇది గ్రామీణ భారతదేశం అభివృద్ధిలో ఉన్నత విద్యా సంస్థలను భాగస్వామ్యం చేస్తుంది. సాంకేతిక పరంగా వెనకబడిన శ్రామికులు, కార్మికులు, చేతి వృత్తుల వారికి చేదోడుగా నిలిచే ప్రాజెక్టుల రూపకల్పనకు ప్రోత్సాహకాలను ఇస్తుంది. దీంతో వనరుల్ని సద్వినియోగం చేసుకోవడం, ఆర్థిక క్రమశిక్షణ, పురోభివృద్ధికి అవసరమైన సాంకేతికను అందించడంలో విద్యార్థులు మేము సైతం అంటూ ప్రతిభ కనబరుస్తున్నారు. ఉన్నత భారత్ అభియాన్‌లో భాగంగా ఐఐటీ ఢిల్లీతో పాటు, అచ్యుతాపురంలో ప్రశాంతి పాలిటెక్సిక్ కళాశాల ఆరు ప్రాజెక్టులకు రూ.6 లక్షల ప్రోత్సాహకం అందుకుంది. దీనిలో భాగమైన విద్యార్థుల ప్రతిభా పాటవాలు పెరగడంతో పాటు, గ్రామీణ జీవనానికి చేదోడు వాదోడుగా నిలిచే అవకాశం దక్కుతుంది.
ఐదు గ్రామాల దత్తత
ప్రతి ఉన్నత విద్యా సంస్థ కనీసం ఐదు గ్రామాల్ని దత్తత తీసుకోవాల్సి ఉంది. ఆయా గ్రామాల్లో ఉన్న చేతి వృత్తులు, వృత్తిలో సాంకేతికను జోడించే విధంగా విద్యా సంస్థలు కృషి చేయాలి. ఈ క్రమంలోనే అచ్యుతాపురం ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తంతడి, దోసూరు, దొప్పెర్ల, ఎర్రవరం, ఉప్పవరం గ్రామాల్ని ఎంపిక చేసుకున్నారు. తంతడి గ్రామంలో కుమ్మరులు మట్టి పాత్రలు తయారు చేసే విషయంలో కాలుష్య రహితంగా కుండల్ని కాల్చే పరిజ్ఞానాన్ని కళాశాల విద్యార్థులు అందించారు. సెంట్రల్ గ్లాస్, సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కోల్‌కతా, ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాల సంయుక్త ఒప్పందంతో కుమ్మరులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. దీనికి తోడు నిమ్మగడ్డి నుంచి సుగంధ నూనె, యూకలిప్టస్ సైట్రియో డొరా సుగంధ నూనె, పర్యావరణ రహిత కొబ్బరి చిప్పల బొమ్మలు, వ్యక్తిగత పరిశుభ్రత, 3 డీ ప్రింటింగ్ వస్తువులతో బుద్ధి మాంద్యం ఉన్న పిల్లలకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ పెంచుట వంటి అంశాలపై ప్రాజెక్టులు రూపొందించారు. ఒక్కొక్క ప్రాజెక్టుకు రూ.లక్ష చొప్పున ప్రోత్సాహక బహుమతి పొందారు. దీనికి తోడు వందలాది మంది శ్రామికులు, రైతులకు దోహదపడే అంశాలపై అవగాహన కల్పించారు. తద్వారా గ్రామీణ జీవనంలో సుస్థిర అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు.
ఉన్నత్ భారత్ అభియాన్‌లో భాగంగా సత్ఫలితాలు
శ్రామికులు, రైతులకు సాంకేతికతను
అందించడంలో విద్యార్థుల ప్రతిభ
5 గ్రామాలను దత్తత తీసుకున్న ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాల

గ్రామాల సుస్థిర అభివృద్ధికి ఊతం