
నేల బావిలో పడి విద్యార్థి మృతి
నక్కపల్లి: మండలంలో జగన్నాథపురం గ్రామానికి చెందిన ఓ విద్యార్థి ఆదివారం నేలబావిలో పడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన జగతా గంగాద్రి సాయి గణేష్(16) తమ పశువులను మేత కోసం పొలంలోకివ తీసుకెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో దాహం వేయడంతో సమీపంలో ఉన్న నేలబావి వద్దకు వెళ్లి డొక్కుతో నీరు తోడుతుండగా ప్రమాదవశాత్తూ పడిపోయాడు. సమీపంలో ఉన్న వారు గమనించి కేకలు వేసి బావిలో పడిపోయిన సాయిగణేష్‌ను బయటకు తీసి హుటాహుటిన నక్కపల్లి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. సాయిగణేష్ ఇటీవలే పదో తరగతి పాసయ్యాడు. ఈ ఘటనపై మృతుడు తండ్రి జగతా శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సన్నిబాబు తెలిపారు.