
భవిష్యత్ అవసరాలు తీరేలా పథకాల రూపకల్పన
తుమ్మపాల: ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత్ భారత్–2047, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం స్వర్ణాంధ్ర–2047 సాధించే లక్ష్యంతో పనిచేయాలని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయ కృష్ణన్‌తో కలిసి ఆయన శనివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 15 శాతం ఆర్ధికాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పథకాలు రూపొందించాలన్నారు. జిల్లా పరిధిలో ఇప్పుడున్న సవాళ్లను అధిగమించి ‘వికసిత అనకాపల్లి జిల్లా’గా తీర్చిదిద్దాలన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిదినాల కల్పన, మెటీరియల్ కాంపొనెంట్‌లో లక్ష్యాన్ని మించి పనిచేసినందుకు అధికార యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. కేంద్ర పథకాల అమలు తీరుతోపాటు, పర్యాటక రంగం అభివృద్ధి, ఆరోగ్యం కోసం చక్కెర స్థానంలో వినియోగించే విధంగా తాటి బెల్లం, ఆర్గానిక్ బెల్లం ఉత్పత్తిలో అనకాపల్లి జిల్లాకు బ్రాండ్ ఇమేజ్ కల్పించాలన్నారు. జిల్లాలో పరిశ్రమల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయన్నారు.
విస్తృత ప్రచారం కల్పించాలి
స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ 20 సూత్రాల అమలు కార్యక్రమం గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. గ్రామాల్లో రోడ్ల పనులు పూర్తయ్యాక సాగునీటి కాలువల లైనింగు పనులు చేపట్టాలన్నారు. జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్‌ల కింద నుంచి నీటి పైపులు వేయడానికి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, వాటిని పరిష్కరించాలన్నారు. అనంతరం మీడియా సమావేశంలో పలు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతయ్యబాబు, పి.వి.జి.కుమార్, మళ్ల సురేంద్ర, కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ ఈర్లె శ్రీరామ్మూర్తి, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, హౌసింగు పీడీ వై.శ్రీనివాస్, డ్వామా పీడీ ఆర్. పూర్ణిమాదేవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
15 శాతం అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించాలి
అనకాపల్లికి తాటి బెల్లం, ఆర్గానిక్ బెల్లం బ్రాండ్ ఇమేజ్
ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్