
ఏడాదిలోపే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత
నర్సీపట్నం: ఏడాది కాక మునుపే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి విమర్శించారు. నర్సీపట్నంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అధ్యక్షతన శుక్రవారం పార్టీ నియోజకవర్గ మండల కమిటీల ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించి, ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఎండగట్టాలన్నారు. గ్రామ, బూత్ కమిటీలతో 18 లక్షల మందితో జగనన్న సైన్యం తయారవుతుందన్నారు. ఈ సైన్యానికి ఐడీ కార్డులతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఈ సైన్యంతో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఇకపై పార్టీ కార్యకర్తకు సముచిత స్థానం కల్పించేందుకు జగనన్న నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మళ్లీ జగనన్నను సీఎం చేసేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నందున పార్టీ నాయకులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ నెలాఖరుకు పార్టీ అనుబంధ విభాగాల ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. మహిళా విభాగాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం వేధింపులకు గురైన వారి తరఫున పోరాటంలో కార్యకర్తలు ముందుండాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వానికీ ఏడాదిలోపు ఇంత వ్యతిరేకత కనిపించలేదన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతి విద్యార్థికి రూ.15 వేలు, ప్రతి మహిళకు రూ.18 వేలు ఇస్తామన్న హామీ గాలికివదిలేశారని ఆమె ధ్వజమెత్తారు.
కేసులకు భయపడం..
మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో పాలన చాలా దారుణంగా ఉందన్నారు. కేసులకు భయపడే ప్రసక్తిలేదన్నారు. రానున్న రోజుల్లో పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండకడతామన్నారు. జగనన్న కంటే సంక్షేమ పథకాలు ఇంకా బాగా ఇస్తారనే ఆశతో కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి ప్రజలు మోసపోయారని చెప్పారు. గ్రామ, బూత్ కమిటీల ఏర్పాటుకు పార్టీ నాయకులు కసరత్తు చేయాలన్నారు. అనంతరం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల సన్యాసిపాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నంలో వేధింపుల పాలన కొనసాగుతుందన్నారు. పార్టీ నాయకుల ఇళ్లు కూలగొట్టించడం, మర్డర్, కిడ్నాప్ కేసులు పెట్టి పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు అమ్ముడుపోయాయన్నారు. న్యాయ వ్యవస్థ బతికి ఉండడంతో కేసులను దీటుగా ఎదుర్కొంటున్నామన్నారు. సంక్షేమ పథకాలను అటకెక్కించి, విశాఖలోని విలువైన భూములను దోచుకుంటున్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రుత్తల యర్రాపాత్రుడు, మున్సిపల్ చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, పార్టీ టౌన్ అధ్యక్షుడు ఏకా శివ, జిల్లా మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత, ఎంపీపీలు గజ్జలపు మణికుమారి, రుత్తల సర్వేశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షులు శానపతి వెంకటరత్నం, నాగేశ్వరరావు, చిటికెల రమణ, వివిధ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై నిలదీయండి
ప్రభుత్వ నియంతృత్వ పోకడలపైపోరాటాలు
వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు హైమావతి పిలుపు

ఏడాదిలోపే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత