
చక్కెర ఫ్యాక్టరీలను ఎపుడు తెరిపిస్తారు ఎంపీగారూ!
కోటవురట్ల : జిల్లాలో మూతపడిన నాలుగు చక్కెర కర్మాగారాలను ఎపుడు తెరిపిస్తారో ఎంపీ సీఎం రమేష్ ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.ఎస్.సత్యనారాయణరాజు ప్రశ్నించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంపీ సీఎం రమేష్ ఎన్నికల ముందు ఎన్నో హామీ లు కురిపించారని, అందు లో తాండవ, ఏటికొప్పాక, గోవాడ, తుంపాల చక్కెర కర్మాగారాలను తెరిపించి రైతుల జీవితాలలో వెలుగులు నింపుతామని కూటమి తరపున హామీ ఇచ్చారన్నారు. ప్రతి చిన్న విషయానికి ఎంతో హడావుడి చేసే ఎంపీ రమేష్ రైతుల కష్టాల పట్ల ఎందుకు స్పందించడంలేదో తెలపాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా సీఎం రమేష్ చక్కెర ఫ్యాక్టరీలను ఒక్కరోజు కూడా సందర్శించిన పాపాన పోలేదన్నారు. గోవాడ చక్కెర కర్మాగారంలో చెరకు రైతులు అనేక సమస్యలతో ఉక్కిరిబిక్కిరై రోడ్డెక్కి తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపినా ప్రభుత్వానికి పట్టలేదని విమర్శించారు. నాలుగు ఫ్యాక్టరీలను తెరిపించి చెరకుసాగులో అత్యధిక దిగుబడులు వచ్చేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. అధిక దిగుబడిని ఇచ్చే కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన చెరకు దవ్వను తెప్పించి ఇక్కడి రైతులకు సరఫరా చేయాలన్నారు. అంతేకాకుండా వరి, చెరకు పంటలను ప్రోత్సహించేలా ఉపాధి పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు.
వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణరాజు

చక్కెర ఫ్యాక్టరీలను ఎపుడు తెరిపిస్తారు ఎంపీగారూ!