
కళ్ల ముందే కుమారుడి మరణం
సబ్బవరం: సబ్బవరం మండలం చిన్నపాలెం సమీపంలో అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం ఆ నిరుపేద కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. నాతవరం మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన నక్కా అప్పలస్వామి, పద్మ దంపతులు ఆనందపురం మండలం గిడిజాల సమీపంలోని నీళ్లకుండీల వద్ద ఓ సిమెంట్ ఇటుక బట్టీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. స్వగ్రామంలో జరిగిన బోడకొండమ్మ పండగలో పాల్గొని, తిరిగి పనికి వెళ్లడానికి తమ తొమ్మిదేళ్ల కుమారుడు మనోజ్తో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. జాతీయ రహదారిపై చిన్నపాలెం సమీపంలో నిలిచి ఉన్న కోళ్లను తరలించే బొలెరో వాహనాన్ని వారి ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు మనోజ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అప్పలస్వామి, పద్మ తీవ్ర గాయాలతో హాహాకారాలు చేశారు. వారిని హుటాహుటిన 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
వెంటాడుతున్న విషాదం: ఈ కుటుంబంలో ఇది రెండో విషాదం. అంతకుముందు వారి చిన్న కుమారుడు శర్వాన్ సత్యనారాయణ గుండె సంబంధిత వ్యాధితో మరణించాడు. ఒక బిడ్డను వ్యాధితో పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులు, ఇప్పుడు పెద్ద కొడుకును కూడా రోడ్డు ప్రమాదంలో కోల్పోయారు. మనోజ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. మృతుడు మనోజ్ పెదనాన్న అప్పలకొండ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సింహాచలం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చావుబతుకుల మధ్య తల్లిదండ్రులు
జాతీయ రహదారిపై మృత్యుఘోష