
వడ్డాది టీడీపీ అధ్యక్షుడి ఎన్నికలో వర్గ విభేదాలు
బుచ్చెయ్యపేట : ఎమ్మెల్యే రాజు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు మధ్య వర్గ విభేదాల ప్రభావం ఇపుడు వడ్డాది టీడీపీ అధ్యక్షుడు పదవిపై పడింది. ఇటీవల గ్రామ టీడీపీ అధ్యక్షుని ఎన్నికల్లో భాగంగా గ్రామ టీడీపీ నాయకులు వడ్డాదిలో మీటింగ్ పెట్టారు. రెండేళ్లుగా టౌన్ అధ్యక్షుడిగా ఉన్న రాష్ట హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు మేనల్లుడు దొండా నరేష్‌ను తిరిగి టౌన్ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. అనంతరం కమిటీ మెంబర్లు తీర్మానం కాపీని మండల టీడీపీ గౌరవ అధ్యక్షుడు తమరాన దాసుకు, ఎమ్మెల్యే రాజుకు అందించారు. వడ్డాది టౌన్ అధ్యక్షుడిగా ఎన్నికై న నరేష్ ఎమ్మెల్యే రాజును కలిసి ఎన్నికై న విషయాన్ని తెలపగా ఎమ్మెల్యే అతనిని అభినందించారు. ఇదే పదవి నరేష్‌కు కాకుండా తాతయ్యబాబు బావమరిది గ్రామదేవత మోదకొండమ్మ ఆలయ కమిటీ చైర్మన్ దొండా గిరిబాబుకు ఇవ్వాలని మాజీ ఉప సర్పంచ్ సయ్యపురెడ్డి శ్రీనివాసరావు, మండల యాదవ సంఘం అధ్యక్షుడు శింగంపల్లి రమేష్, నాయకుడు శ్యామ్ తదితరులు తీర్మానం చేసి ఎమ్మెల్యే రాజును కలిసి దరఖాస్తు అందించారు. అప్పటికే నరేష్‌ను టౌన్ టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించిన విషయం ఎమ్మెల్యేకు తెలిసినా ఆ విషయాన్ని రెండో వర్గానికి చెప్పకుండా వారి నుంచి దరఖాస్తు తీసుకోవడంపై పలువురు టీడీపీ నాయకులు ఆగ్రహం చెందుతున్నారు. స్వయాన తాతయ్యబాబు మేనల్లుడు దొండా నరేష్, బావమరిది దొండా గిరిబాబు వడ్డాది టౌన్ అధ్యక్షుడి పదవికి పోటీ పడడం వెనక ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరి బయట పడిందని అంటున్నారు. సోమవారం చోడవరంలో నియోజకవర్గ మినీ మహానాడు జరిగినా వడ్డాది టౌన్ అధ్యక్షుడి పేరు మాత్రం ఎమ్మెల్యే ప్రకటించలేదు. వేంకటేశ్వరస్వామి దేవస్ధానం మాజీ చైర్మన్ సయ్యపురెడ్డి మాధవరావు, కోవెల అప్పనదొర జిల్లా పరిషత్ హైస్కూల్ చైర్మన్ మేడివాడ రమణ, మాజీ వార్డుమెంబర్, తలారి శంకర్,నాయకులు ముత్యాల సూరిబాబు తదితరులు నరేష్‌నే వడ్డాది టౌన్ అధ్యక్షుడిగా నియమించాలని పట్టుబడగా, మరో వర్గం గిరిబాబుకి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఎమ్మెల్యే రాజు ఎవరిని ఎంపిక చేస్తారోనని ఎదురు చూస్తున్నారు.