
ఏపీఐఐసీ భూముల్లో.. కూటమి గద్దలు
గ్రావెల్ దందాలో హోం మంత్రి అనుచరులు
నియోజకవర్గంలో ఎక్కడైనా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరిపితే సహించేది లేదని హోం మంత్రి అనిత ప్రకటించినప్పటికీ ఆమె ఆనుచరులుగా చెప్పుకుంటున్న వారే గ్రావెల్ దందాలకు పాల్పడటం గమనార్హం. నిత్యం వందలాది ట్రాక్టర్లపై తరలించి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. యథేచ్ఛగా గ్రావెల్, ఇసుక తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ మైనింగ్, ఏపీఐఐసీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతులు చెబుతున్నారు. ఎవరైనా అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే హోం మంత్రి పేరు చెప్పి బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నారయి. బదిలీ చేయిస్తాం, అవసరమైతే భౌతిక దాడులకు పాల్పడతామంటూ హెచ్చరించడం వల్లే అధికారులు కూటమి నాయకుల దందాను అరికట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై సీఐ కుమార స్వామి వద్ద ప్రస్తావించగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నట్లు రెవెన్యూ సిబ్బంది నుంచి ఫిర్యాదు వచ్చిందన్నారు. ట్రాక్టర్ల పట్టుకుని అప్పగించ లేదన్నారు. కొన్ని వాహనాల నంబర్లు, నంబర్లు లేని ట్రాక్టర్ల వివరాలు ఇచ్చారన్నారు. వాహనాలను తమకు అప్పగిస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
నక్కపల్లి: సహజ వనరుల దోపిడీలో కూటమి నాయకులకు హద్దు అదుపు లేకుండా పోతోంది. పరిశ్రమల కోసం ఏపీఐఐసీ వారు సేకరించిన భూముల్లో గద్దల్లా వాలిపోయి జేసీబీలతో వేలాది క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను తవ్వేస్తూ ట్రాక్టర్లపై తరలించి అమ్ముకుంటున్నారు. నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా ఒక్క ట్రాక్టర్ గ్రావెల్ తవ్వినా సరే సహించేది లేదని, దాడులు చేసి కేసులు నమోదు చేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత ఇచ్చిన ఆదేశాలను వారు బేఖాతరు చేస్తున్నారు. మంత్రి ఆదేశాలను పక్కన పెట్టేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని గ్రావెల్ దందా కొనసాగిస్తున్నారు. అడ్డుకుంటున్న అధికారులను మంత్రి పేరు చెప్పి బెదిరిస్తున్నారు. పరిశ్రమల స్థాపన కోసం ఏపీఐఐసీ వారు చందనాడ, అమలాపురం, రాజయ్యపేట, బుచ్చిరాజుపేట, బోయపాడు తదితర గ్రామాల్లో ఐదు వేల ఎకరాలను సేకరించింది. నష్టపరిహారం, ప్యాకేజీ చెల్లింపు ప్రక్రియ పూర్తిచేసి భూములను స్వాధీనం చేసుకుంది. ఈ భూములను బల్క్‌డ్రగ్ పార్క్, ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ల కోసం కేటాయించింది. పరిశ్రమలు స్థాపించే ప్రాంతాల్లో ఏపీఐఐసీ వారు మౌలిక సదుపాయాల కల్పించే పనులు ప్రారంభించారు. రోడ్లు, డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. పనులు చేసే సంస్థలకు గ్రావెల్, ఇసుక అవసరం ఉంది. దీంతో ఉపమాక, నీలకుండీలు, చందనాడ గ్రామాలకు చెందిన కొంతమంది టీడీపీ నాయకులు ఏపీఐఐసీ వారు సేకరించిన భూముల్లో కొండలు, ఇసుక దిబ్బల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతి లేకుండా జేసీబీలను ఏర్పాటు చేసి రాత్రి సమయాల్లో వేలాది క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను తవ్వేస్తున్నారు. ఇలా తవ్విన గ్రావెల్‌ను నంబర్లు లేని ట్రాక్టర్లపై తరలించి సమీపంలో ఉన్న రసాయన పరిశ్రమలకు, ఇళ్లు, రోడ్లు నిర్మించే వారికి, మౌలిక సదుపాయాలు కల్పించే కాంట్రాక్టర్లకు విక్రయిస్తున్నారు. 15 రోజులుగా జరుగుతున్న ఈ దందా వెనుక మంత్రి అనుచరులమంటూ చెప్పుకు తిరిగే టీడీపీ నాయకుల అండదండలతోపాటు, వారికే చెందిన జేసీబీలు, ట్రాక్టర్లు ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది రెండు రోజు క్రితం రాత్రి సమయాల్లో దాడులు చేసి గ్రావెల్ తవ్వుతున్న జేసీబీలు, ట్రాక్టర్లను పట్టుకున్నారు. వాటి నంబర్లను నమోదు చేసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే రెవెన్యూ వారిచ్చిన నంబర్ల ఆధారంగా పట్టుబడ్డ వాహనాలను సీజ్ చేయడం కేసులు నమోదు చేయకుండా కొంతమంది కూటమి నాయకులు పైరవీలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
జేసీబీలతో రాత్రిపూట గ్రావెల్ తవ్వకాలు
నంబర్లు లేని వాహనాల్లో అక్రమంగా తరలింపు
హోం మంత్రి ఆదేశాలు బేఖాతరు
పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన రెవెన్యూ వర్గాలు
కేసులు నమోదు చేయకుండా కూటమి నేతల ప్రయత్నాలు
ఏపీఐఐసీ భూముల్లో జేసీబీతో గ్రావెల్ తవ్వుతున్న దృశ్యం

ఏపీఐఐసీ భూముల్లో.. కూటమి గద్దలు