
తగ్గిన ఉత్తీర్ణత.. పెరిగిన స్థానం
● టెన్త్‌లో గతేడాది కన్నా 0.56 శాతం తగ్గిన ఉత్తీర్ణత ● 88.44 శాతం ఉత్తీర్ణతతో 5వ స్థానంలో నిలిచిన అనకాపల్లి జిల్లా ● 20,684 మందికి గాను 18,293 మంది పాస్ ● 91.03 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించిన బాలికలు ● రాంబిల్లికి చెందిన అనీషకు 599 మార్కులతో స్టేట్ 2వ ర్యాంక్ ● ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధికంగా 595 మార్కులు
సాక్షి, అనకాపల్లి:
పది ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. బుధవారం వెలువడిన పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలోనే ఐదో స్థానంలో నిలిచారు. అనకాపల్లి జిల్లాలో 88.44 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా గతేడాదిలాగే మళ్లీ బాలికలే పైచేయి సాధించారు. జిల్లాలో బాలురు 85.88 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలికలు 91.03 శాతం ఉత్తీర్ణతతో దూసుకుపోయారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పదిలో ఫలితాలు వచ్చాయి. జిల్లాలో గతేడాది కన్నా ఒక శాతం ఉత్తీర్ణత తగ్గినా.. రాష్ట్రంలో ఐదో స్థానానికి ఎగబాగింది. గతేడాది 89 శాతం సాధించినా పదో స్థానంతో సంతృప్తి పడాల్సి వచ్చింది. జిల్లా నుంచి మొత్తం 20,684 మంది పరీక్షలు రాయగా వారిలో 18,293 మంది ఉత్తీర్ణులయ్యారు. 10,393 మంది బాలురకు 8,925 మంది, 10,291 బాలికలకు 9,368 మంది ఉత్తీర్ణత సాధించారు.
ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పలువురు విద్యార్థులు జిల్లా టాపర్లుగా నిలిచారు. సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 84.6 శాతం ఉత్తీర్ణత నమోదయింది. ప్రైవేట్ పాఠశాలలు 97 శాతం ఉత్తీర్ణత సాధించాయి. అయితే బీసీ వెల్ఫేర్ పాఠశాలల్లో, ఏపీఆర్‌ఎస్ స్కూళ్లలో 99 శాతం ఉత్తీర్ణత, కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూళ్లలో 96 శాతం ఉత్తీర్ణత వచ్చింది. జెడ్పీ హైస్కూల్స్‌లో 83 శాతం, సోషల్ వెల్ఫేర్ పాఠశాలల విద్యార్థులు 89 శాతం విజయం సాధించారు.
చీడికాడ మండలం టాప్
జిల్లాలోని 24 మండలాల్లో ఫలితాలను పరిశీలిస్తే.. చీడికాడ మండలం 96 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలిచింది. దేవరాపల్లి, గొలుగొండ మండలాల్లో అత్యల్పంగా 81 శాతం నమోదయింది.
నాటి సంస్కరణల ఫలితమే..
నాటి సంస్కరణలే నేడు పదిలో ఉత్తమ ఫలితాలను తీసుకొచ్చాయి. దశాబ్ద కాలం క్రితం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు 90 శాతం మార్కులు రావడమంటే గగనంగా ఉండేది. కానీ గత మూడేళ్లుగా ఫలితాలు పరిశీలిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టాప్ లేపుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నారు. సంకల్ప బలం ఉండాలే గానీ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన విద్యాసంస్కరణలు నిరూపించాయి. ఎంతో దూరదృష్టితో అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, విద్యా బోధనలో సమూల మార్పులు, నాడు–నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ నేటి ఫలితాలకు మూలంగా మారాయి.

తగ్గిన ఉత్తీర్ణత.. పెరిగిన స్థానం

తగ్గిన ఉత్తీర్ణత.. పెరిగిన స్థానం

తగ్గిన ఉత్తీర్ణత.. పెరిగిన స్థానం