తుమ్మపాల : మండలంలో కొండుపాలెం పంచాయతీ చేనుల అగ్రహారం గ్రామంలో ఈ నెల 9న జరిగిన గ్రామ దేవత శ్రీ సత్తెమ్మ తల్లి జాతరలో మొదలైన ఫ్లెక్సీల వివాదం తీవ్రతరమై టీడీపీ వర్సస్ జనసేనగా మారింది. ఆ రోజు ఉదయం ఫ్లెక్సీల చించివేతతో మొదలైన ఘర్షణ సాయంత్రానికి ఒకరిపై మరొకరు కాపుకాచి దాడులు చేసుకునేంతగా ముదిరిపోయింది. టీడీపీ ఎంపీటీసీ భర్త మధుపాడ నరసింగరావు, జనసేన పార్టీ నేత, మాజీ సర్పంచ్ మధుపాడ శ్రీనివాసరావు, వారి కుటుంబసభ్యులు తీవ్రంగా కొట్టుకున్నారు. గాయాలపాలైన ఇరు వర్గాలు స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. మధుపాడ నరసింగరావును మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఇరువురికీ న్యాయం చేయలేక జనసేనకు చెందిన శ్రీనివాసరావును వైఎస్సార్‌సీపీ నేతగా తప్పుడు ప్రకటన చేయడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. కాగా ఇరువర్గాలను పోలీసులు విచారించారు. ఎటువంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చేనుల అగ్రహారంలో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు
తీవ్ర గాయాలపాలైన ఎంపీటీసీ భర్త నరసింగరావు