అంతుబట్టని పాముల పరిస్థితి..

- - Sakshi

అచ్యుతాపురం (అనకాపల్లి): ఏపీలో అతి పెద్ద తీర ప్రాంతాల్లో ఒక్కటైన పూడిమడకలో పాముల కలకలం రేగింది. సముద్ర మొగ నుంచి నీరు వెళ్లే ఉప్పుటేరులో వందలాది పాములు శుక్రవారం ప్రత్యక్షమయ్యాయి. దీంతో పూడిమడకలో ఒక్కసారిగా ఆందోళన రేగింది. మత్స్యకారుల్లో ఆగ్రహావేశాలు మిన్నంటాయి. అసలు ఉప్పుటేరులో పాములేంటి? అవి ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

అంతుబట్టని పాముల పరిస్థితి..
ఉప్పుటేరులో ప్రత్యక్షమయ్యిన పాముల గురించి ఆ నోటా ఈ నోటా సమాచారం అందడంతో మత్స్యకారులంతా ఉప్పుటేరుకి వెళ్లారు. పాముల్ని చూసిన వారు కాస్త ఇబ్బందికి గురయ్యారు. సుమారు 200 కుటుంబాలకు చెందిన మత్స్యకారులు ఈ ఉప్పుటేరులో చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తుంటారు. ఈ ఉప్పుటేరులోకి గతంలో కలుషిత నీరు రావడం వల్ల చేపలు మృతి చెందినప్పటికీ అధికారులు రకరకాల కారణాలు చెప్పి మత్స్యకారుల్ని శాంతింపజేశారు. అయితే తాజాగా కనిపిస్తున్న వందలాది పాములు సముద్రపు జెర్రిలని కొందరు చెబుతుండగా, పరిశ్రమలు వదిలిన వ్యర్థాల నుంచి ఉప్పుటేరులోకి చేరి ఉంటాయనే ప్రచారం మరొకటి ఉంది. నీటిలో చురుగ్గా కదులుతున్న ఈ పాముల్ని కర్రతో పట్టుకుని ఒడ్డుపై వేస్తే ఏవో రసాయనాలు కక్కి చనిపోవడంతో మత్స్యకారుల్లో భయం పట్టుకుంది.

ఉద్యమించేందుకు సన్నద్ధం..
ఉప్పుటేరులో జరుగుతున్న పరిణామాలపై మత్స్యకారులు ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఒకవైపు మత్స్యసంపదను కోల్పోతున్న మత్స్యకారులకు తాజాగా పాముల సమస్య తలనొప్పిగా మారింది. సముద్రంలోంచి వందలాది పాములు రావాలంటే మొగ వద్ద నుంచి లోపలికి రావాలి. కానీ విశాలమైన సముద్రంలో ఇలాంటి పాములు ఎక్కడికై నా వెళ్లిపోతాయి. కానీ ఉప్పుటేరులోకి చేరాయంటే కంపెనీల వ్యర్థాలేనని మత్స్యకారులు పేర్కొంటున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Anakapalle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top