
● రైతు గ్రూపులకు 40 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లు పంపిణీ ● అనకాపల్లిలో లబ్ధిదారులకు అందజేసిన మంత్రి అమర్‌నాథ్
వైఎస్సార్ యంత్ర సేవా పథకం
సాక్షి, అనకాపల్లి: సులభతర వ్యవసాయం కోసం యంత్ర పరికరాలను అందించే వైఎస్సార్ యంత్ర సేవాపథకం మరోసారి వరాలు కురిపించింది. రెండో విడతగా 148 గ్రూపులకు 72 ట్రాక్టర్లు పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించారు. కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టితో కలిసి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ రైతులకు ట్రాక్టర్లు, యంత్ర పరికరాలను అందజేశారు. అనంతరం రైతులకు చెక్ పంపిణీ చేశారు. గ్రూపులుగా ఏర్పడ్డ చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం 40 శాతం సబ్సిడీపై యంత్ర పరికరాలను సమకూరుస్తున్న విషయం తెలిసిందే. అద్దె ప్రాతిపదికన వ్యవసాయ యంత్ర సేవలను అందించడం ద్వారా వారికి పెట్టుబడి ఖర్చులు, నిర్వహణ వ్యయ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వస్తోంది. అన్నదాతలకు ట్రాక్టర్లు, ఆధునిక యంత్ర పరికరాలను అందిస్తూ రైతు బాంధవుడిగా సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిలుస్తున్నారు. వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఆర్‌బీకేల పేరిట రైతు ముంగిటకే ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి. ఆర్బీకేలకు అనుబంధంగా రైతు మిత్ర గ్రూపులతో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీ) ఏర్పాటు చేశారు.
వ్యవసాయానికి పెద్దపీట
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ రైతు గ్రూపులకు యంత్రపరికరాలను పంపిణీ చేశారు. స్వయంగా ట్రాక్టర్ నడిపి వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. యంత్ర పరికరాల ఖరీదులో 40 శాతం సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోందని చెప్పారు. 50 శాతం మొత్తానికి బ్యాంకు రుణం ఇస్తుంది.. కేవలం 10 శాతం మాత్రమే గ్రూప్ సభ్యులు చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. దళారుల ఆధిపత్యం లేకుండా.. అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారునికి చేరేలా.. తక్కువ ధరలకే ప్రభుత్వం యంత్ర పరికరాలను అందిస్తోందన్నారు. గత ఏడాది మొదటి విడతలో యంత్ర పరికరాల పంపిణీలో 271 గ్రూప్‌లకు రూ.4.61 కోట్ల విలువైన పరికరాలను అందజేసినట్టు తెలిపారు. రెండో విడతలో 148 సీహెచ్‌సీలకు రూ.2 కోట్ల 61 లక్షల 99 వేల విలువైన 72 ట్రాక్టర్లు, వివిధ యంత్ర పరికరాలను సరఫరా చేయడం జరిగిందన్నారు.
450 ఆర్‌బీకేల ద్వారా సేవలు: కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి
జిల్లాలో 450 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సేవలు అందిస్తున్నామని కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి పేర్కొన్నారు. రైతులకు సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు అందించడం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాల్లో సమస్యలను 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి చెబితే.. వాటిని తక్షణమే పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
యంత్ర సేవా పథకం వ్యవసాయదారులకు ఎంతో ప్రయోజనకరమన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.స్మరణ్‌రాజ్, వ్యవసాయ శాఖాధికారి మోహన్‌రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రభాకర్‌రావు, ఎంపీపీ గొర్లె సూరిబాబు, బుల్లిబాబు పాల్గొన్నారు.
జిల్లాలో యంత్ర సేవా పథకం
మొదటి విడతగా 271 గ్రూపులకు 154 ట్రాక్టర్లు రెండో విడతలో 148 గ్రూపులకు 72 ట్రాక్టర్లు
రైతులకు అండగా సీఎం జగనన్న
నాకు మూడు ఎకరాల భూమి ఉంది. వ్యవసాయం చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు దుక్కు, దమ్ములు లాంటివి అద్దెకి చేయించుకునేవాడిని. పెట్టుబడి ఎక్కువైంది. అలా అని సొంతంగా ట్రాక్టర్ కొనుగోలు చేసుకుందామంటే అంత నగదు ఒక్కసారే పెట్టుకోవాలంటే కష్టతరంగా ఉంది. వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా సబ్సిడీలో ట్రాక్టర్ మంజూరయింది. ఇప్పుడు నాకు పెట్టుబడి తగ్గి ఆదాయం పెరుగుతుంది. సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు రైతుకు కష్టాలుండవు.
– కె.కొండబాబు, కె.చింతనిప్పుల అగ్రహారం, అనకాపల్లి మండలం
ఆదాయం పెరుగుతుంది
వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాం. మాకు ఐదు ఎకరాల పొలం ఉంది. ఇప్పటివరకూ అద్దెకు ట్రాక్టర్లతో వ్యవసాయం చేస్తున్నాం. ప్రైవేటు ట్రాక్టర్లు ఎకరా దమ్ముకు రూ.1200 నుంచి రూ.1800 వరకు అద్దె తీసుకుంటున్నారు. ఈ ఏడాది నుంచి మాకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. వ్యవసాయం చేసే మాలాంటి రైతు కుటుంబాల శ్రేయస్సు కోసం పాటుపడే సీఎం జగనన్నకు ధన్యవాదాలు.
– ఎన్.కృష్ణవేణి, కోడూరు, అనకాపల్లి

ట్రాక్టర్ నడుపుతున్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్

బారులు దీరిన ట్రాక్టర్లు

