ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో గ్యాస్ కొరత
కట్టెలపొయ్యిలే ఆధారం
నిర్వాహకులఅవస్థలు
పట్టించుకోని అధికారులు
పెదబయలు: మండలంలో వంటగ్యాస్ కొరత ఏర్పడింది. మండలంలోని 14 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహాలతో పాటుగా గురుకుల పాఠశాల వసతి గృహాలకు గ్యాస్ కొరత వేధిస్తోంది. గత పది రోజుల నుంచి కట్టెల పొయ్యిపైనే వంటలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పెదబయలు భారత్ గ్యాస్ గోదాములో గ్యాస్ స్టాక్ లేకపోవడంతో వినియోగదారులు ముంచంగిపుట్టు, పాడేరు. ఇతర ప్రాంతాల నుంచి అధిక రేట్లకు గ్యాస్ కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానిక ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేసే గ్యాస్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయకపోవడంతో కొరత నెలకొందని దీంతో సరఫరాలో జాప్యం జరిగినట్టు పలువురు చెబుతున్నారు.
రిజిస్ట్రేషన్ కోసం అవస్థలు
పెదబయలు భారత్ గ్యాస్ గోదాములో సోమవారం ఉదయం గ్యాస్ లోడ్ వచ్చింది. దీంతో గొదాము వద్ద వినియోగదారులు బారులు తీరారు. గ్యాస్ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే సరఫరా జరుగుతుందని జీసీసీ సిబ్బంది ప్రకటించారు. దీంతో రిజిస్ట్రేషన్ కోసం వినియోగదారులు అవస్థలు పడ్డారు. కాగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కూడా గ్యాస్ అందకపోవడంతో వినియోగదారులు నానా అవస్థలు పడ్డారు. కొన్ని ఆశ్రమ పాఠశాలలకు మాత్రమే సిలిండర్లు సరఫరా చేశారు. ఆశ్రమ హాస్టళ్లు, పాఠశాలలకు నాలుగు రోజుల్లో గ్యాస్ సరఫరా చేస్తామని గొదాము సిబ్బంది హామీ ఇచ్చి ఆయా పాఠశాలల నిర్వాహకులను పంపినట్టు తెలిసింది. ఇప్పటికై నా ప్రభుత్వం, జీసీసీ ఉన్నతాధికారులు స్పందించి గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
గ్యాస్ కొరత వాస్తవమే
ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో గ్యాస్ కొరత ఉంది. వారం రోజుల నుంచి కట్టెల పొయ్యిపై వండుతున్నారు. సోమవారం స్థానిక గ్యాస్ గోదాముకు లోడ్ వచ్చినా సంక్షేమ పాఠశాలలు, ఆశ్రమ హాస్టళ్లకు సరఫరా చేయలేదు. అయితే ముంచింగిపుట్టు గ్యాస్ గోదాము నుంచి అత్యవసరంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
–జగత్‌రాయ్, ఏటీడబ్ల్యూవో, పెదబయలు
కొరత లేకుండా చర్యలు
గ్యాస్ స్టాక్ రెండు వారాల అనంతరం రావడం జాప్యం వల్ల కొరత ఏర్పడింది. అత్యవసరంగా హాస్టల్స్‌కు కావాల్సి వస్తే ముంచంగిపుట్టు గోదాము నుంచి సరఫరా చేయిస్తాం. ఒక్క లోడ్ వచ్చినా సరిపడడం లేదు. మరో లోడ్ కోసం ఆర్డర్ పెట్టాం. మరో నాలుగు రోజుల్లో లోడ్ రావచ్చు. గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం.
–సుబ్బారెడ్డి, గ్యాస్ గోదాము ఇన్‌చార్జి


