పాడేరు: వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రైతులకు అందే విధంగా చూడాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ సోమవారం కలెక్టర్ దినేష్‌కుమార్ అధ్యక్షతన లీడ్ బ్యాంకు మేనేజర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మూడో త్రైమాసిక బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారులు, సంఘాలకు పెట్టుబడి రుణ సహాయంతో ప్రోత్సహించాలన్నారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా కలిగిన రైతులకు రుణ వితరణ, కౌలు రైతులకు, పశు సంవర్ధక , పిషరీష్, పట్టు పరిశ్రమలకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు మంజూరు చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, రుణాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులకు రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలన్నారు. పరిశ్రమల శాఖకు సంబంధించి ముద్ర రుణాలు, తయారీ, సేవా రంగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ, పీఎం విశ్వకర్మ రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో రూరల్ సెల్ఫ్ ఎంప్లాయీమెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో అరకులోయలో ప్రారంభిస్తామన్నారు. ప్రతినెల రెండు ధఫాలుగా స్వయం ఉపాధి ద్వారా వ్యాపారం ప్రారంభిస్తామన్నారు. జిల్లాలో కొత్త బ్యాంకులను ప్రారంభించి మారుమూల గ్రామాలకు సేవలందించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజనల్ హెడ్ రాజ, ఆర్‌బీఐ లీడ్ జిల్లా అధికారి నవీన్, నాబార్డ్ డీడీఎం గౌరీశంకర్, లీడ్ బ్యాంకు మేనేజర్ మాతునాయుడు, ఎస్‌బీఐ, ఏపీజీవీబీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ, ఇతర బ్యాంకుల మేనేజర్లు, పరిశ్రమల శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో రూ.2,730 కోట్ల క్రెడిట్ సామర్థ్యం అంచనా
జిల్లాలో ఉన్న అన్ని బ్యాంకులు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి క్రెడిట్ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2026–27 ఆర్ధిక సంవత్సరానికి రూ.2,730 కోట్ల క్రెడిట్ సామర్థ్యాన్ని గుర్తించామన్నారు. వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం జిల్లా స్థాయి క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
కలెక్టర్ దినేష్‌కుమార్


