సర్పంచులకు ‘చెక్‌’ పవర్‌ కట్‌ | - | Sakshi
Sakshi News home page

సర్పంచులకు ‘చెక్‌’ పవర్‌ కట్‌

Mar 31 2026 8:26 AM | Updated on Mar 31 2026 8:26 AM

వచ్చే నెల 2తో ముగియనున్న సర్పంచుల పదవీ కాలం ముందుగానే చెక్కుల జారీపై ఆంక్షలు.. నిధుల వినియోగంపై నిఘా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే లక్ష్యంగాకొత్త నిబంధనలు? ఏప్రిల్‌ 3 నుంచి 78 పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన

మహారాణిపేట: గ్రామ పంచాయితీల సర్పంచుల పదవీకాలం ముగియక ముందే వారి అధికారాలను కూటమి ప్రభుత్వం పరిమితం చేయడం వివాదాస్పదంగా మారింది. ఏప్రిల్‌ 2తో సర్పంచుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, నిధుల దుర్వినియోగం జరుగుతుందనే అనుమానంతో ప్రభుత్వం ముందస్తుగా పలు ఆంక్షలు విధించింది. ఇప్పటివరకు స్వేచ్ఛగా చెక్కులు జారీ చేసిన సర్పంచులు, ఇప్పుడు వాటిని నేరుగా వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. చెక్కుల మంజూరు అధికారాన్ని డివిజన్‌ లెవల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్ల (డీఎల్‌డీవో) చేతుల్లోకి మార్చారు. దీంతో గ్రామ పాలనలో సర్పంచుల పాత్ర గణనీయంగా తగ్గింది.

పెత్తనమంతా డీఎల్‌డీవోలదే..

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సర్పంచుల అధికారాలపై తీవ్రస్థాయిలో ఆంక్షలు అమలవుతున్నాయి. జిల్లాలోని 79 గ్రామ పంచాయతీల్లో మెజారిటీ సర్పంచులు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు కావడమే ఈ ఆంక్షలకు ప్రధాన కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సర్పంచులు జారీ చేసే చెక్కులను నేరుగా ఆమోదించకుండా, పంచాయతీ అధికారుల ద్వారా డివిజన్‌ లెవల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ అనుమతిని తప్పనిసరి చేశారు. వృథా ఖర్చులు చేస్తారనే సాకుతో పాలక వర్గాలను ఆర్థికంగా కట్టడి చేయడంపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ కక్షసాధింపేనా?

జిల్లాలోని మూడు వంతుల పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే సర్పంచులుగా ఉండటంతో, వారిని ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో పదవీ కాలం ముగిసే వరకు సర్పంచులకు పూర్తి స్వేచ్ఛ ఉండేదని, కానీ ఇప్పుడు కొత్త పద్ధతుల పేరుతో తమను అధికారులు వేధిస్తున్నారని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏప్రిల్‌ 3 నుంచి ’స్పెషల్‌’ పాలన

జిల్లాలోని పంచాయతీల రూపురేఖలు ఏప్రిల్‌ 3 నుంచి మారనున్నాయి. భీమిలి మండలం రేఖవానిపాలెం మినహా (దీనికి ఇంకా ఏడాది గడువు ఉంది), మిగిలిన 78 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగనుంది. ఏప్రిల్‌ 2వ తేదీ అర్ధరాత్రితో సర్పంచుల పదవీ కాలం ముగియనుండటంతో, మరుసటి రోజు నుంచే పగ్గాలు చేపట్టేందుకు 78 మంది స్పెషల్‌ ఆఫీసర్ల నియామక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement