పాడేరు: జిల్లాలో పలుచోట్ల చేపడుతున్న అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా బడ్జెట్ రూ.3,067.076కోట్లు కాగా అరకు నియోజకవర్గానికి రూ.1545.823 కోట్లు, పాడేరు నియోజకవర్గానికి రూ.1460.793 కోట్లతో అంచనాలను రూపొందించారు. ఆయా నియోజకవర్గాలకు ఐదుగురు అధికారులతో నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభ దశలో వారానికి రెండుసార్లు సమీప ఆస్పత్రుల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 3426 పీఎం జన్‌మన్ గృహాలకు 1385 గృహాలు పూర్తయినట్టు చెప్పారు. అనంతరం ఆమె మండలంలోని గొండెలి పంచాయతీ పిల్లిపుట్టు గ్రామంలో నాలుగు గృహాలను ప్రారంభించారు. గృహాలన్నీ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో, ఇన్‌చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్‌కుమార్, రాష్ట్ర జానపద కళలు, సాంస్కృతిక అకాడమి చైర్మన్ వంపూరి గంగులయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సతీష్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి


