యలమంచిలిలో భారీ చోరీ | - | Sakshi
Sakshi News home page

యలమంచిలిలో భారీ చోరీ

Mar 26 2026 7:40 AM | Updated on Mar 26 2026 7:40 AM

కట్టుపాలెం చెరకు కాటా వద్ద

ఓ ఇంట్లో 9 తులాల బంగారం అపహరణ

ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన క్లూస్‌ టీం

యలమంచిలి రూరల్‌ : పట్టణ ఠాణా పరిధి కట్టుపాలెం చెరకు కాటా సమీపంలో కొత్తపాలెం వెళ్లే రహదారి పక్కనున్న ఓ ఇంట్లో బుధవారం భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 9 తులాల బంగారు ఆభరణాలు, మరికొన్ని వెండి వస్తువులు కాజేశారు.ఇక్కడ నివాసముంటున్న రైతు బొడ్డేటి సతీష్‌ ఇంట్లో బుధవారం మధ్యాహ్నం బీరువాలో భధ్రపరిచిన సుమారు 9 తులాల బరువున్న 4 బంగారు ఆభరణాలు, మరికొన్ని వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. బాధితుడు, ఘటనా స్థలంలో స్థానికుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం రైతు సురేష్‌ పొలం పని చేసుకోవడానికి వెళ్లారు.అతని భార్య యలమంచిలి పట్టణంలో ఒక ప్రైవేటు పాఠశాలలో పిల్లల చదువుకు సంబంధించి వాకబు చేయడానికి వెళ్లారు. ఇంటికి తాళాలు వేసి పక్కనే ఒక ప్రదేశంలో దాచి వెళ్లారు.ఇంట్లో ఎవరూ లేరని ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు తీసుకుని ఇంట్లోకి వెళ్లి బీరువాలో దాచిన బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన భార్య బీరువా తెరిచి ఉండడం చూసి పరిశీలించగా బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు తెలిసింది.

దీంతో బాధితుడు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తామెవరూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల మధ్యలో చోరీ జరగడాన్ని బట్టి తెలిసిన వారి పనే అయి ఉంటుందని బాధిత కుటుంబీకులు అనుమానిస్తున్నారు. సీఐ ధనుంజయరావు, పట్టణ ఎస్‌ఐ కె.సావిత్రి, ఏఎస్‌ఐ చెల్లారావు, అనకాపల్లి నుంచి క్లూస్‌ టీం బృందం చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. బాధిత కుటుంబీకుల నుంచి చోరీకి సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. చోరీ సమాచారాన్ని పోలీసులు మీడియాకు వెల్లడించలేదు.

ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌ టీం సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement