నర్సీపట్నం:రపభుత్వం తక్షణమే స్మార్ట్ కిచెన్ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎంఈవో కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శంకరరావు మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా మధ్యాహ్న భోజన కార్మికులు.. పిల్లలకు వండి పెడుతున్నారు. కేంద్రం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు స్మార్ట్ కిచెన్ పేరుతో ఒకే చోట నుంచి స్కూళ్లకు క్యారేజీలు పంపాలని నిర్ణయించాయన్నారు. ఈ స్మార్ట్ కిచెన్ల వల్ల వేలాదిమంది వంట కార్మికులు ఉపాధి కోల్పోతాయరని చెప్పారు. కార్మికులందరూ ఐక్యంగా ప్రభుత్వ నిర్ణయాన్ని తిప్పి కొట్టాలన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం సెంట్రల్ కిచెన్ పేరుతో అక్షయపాత్ర, ఇస్కాన్, నవ ప్రయాస వంటి సంస్థలకు కట్టబెడితే నాడు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని ముట్టడించినట్టు గుర్తు చేశారు. కేసులు పెట్టి జైలుకు పంపినా ఐక్యంగా పోరాడాం దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గిందన్నారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం ప్రతి మండలంలో రెండు స్మార్ట్ కిచెన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం ఇచ్చే మెనూ చార్జీలు చాలకపోయినా పిల్లలకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన భోజనాన్ని కార్మికులు అందిస్తున్నారన్నారు. సమయానికి బిల్లులు రాకపోయినా అప్పులు చేసి భోజనం అందిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భోజన పథకాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని కంకణం కట్టుకున్నాయన్నారు. ఒక్కో స్మార్ట్ కిచెన్‌కు ప్రభుత్వమే స్థలం ఇచ్చి, రూ.55 లక్షలతో నిర్మిస్తుందన్నారు. మనకు మాత్రం వంట షెడ్లు, పాత్రలకు నిధులు ఖర్చు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మిడ్డే మీల్ కార్మిక సంఘం నాయకులు ఒ.నూకరాజు, సత్యవతి, ప్రసన్న, ఇ.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


