మన్యంలో చలి తీవ్ర రూపం దాలుస్తోంది. గురువారం ఒక్కసారిగా
సాక్షి,పాడేరు: మన్యం వాసులు చలితీవ్రతకు వణికిపోతున్నారు. గురువారం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జి.మాడుగుల, డుంబ్రిగుడ, అరకువ్యాలీ, ముంచంగిపుట్టు, హుకుంపేట, పాడేరు, పెదబయలు, వై.రామవరం, మారేడుమిల్లి ప్రాంతాల ప్రజలు చలికి తాళలేక ఇబ్బందులు పడ్డారు. జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీలోని గ్రామాలతోపాటు, పాడేరు మండలం సంగోడి ప్రాంతంలో మంచు గడ్డ కట్టి కశ్మీరు వాతావరణాన్ని తలపించింది. పొలాల్లో కప్పిన టార్పాలిన్లపై మంచు బిందువులు గడ్డకట్టాయి. ఈ దృశ్యాలను స్థానికులు సెల్‌ఫోన్లతో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గతేడాది పాడేరు పరిసర ప్రాంతాల్లో వరి గడ్డి, కార్ల అద్దాలపై పలుచగా గడ్డ కట్టిందని, ఈ ఏడాది మంచు ఐసు గడ్డలను తలపించిందని స్థానికులు తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి మంచు దట్టంగా కురుస్తోంది. చలికి తాళలేక మంటలను ఆశ్రయిస్తూ ఉపశమనం పొందుతున్నారు.
చలి తీవ్రతకు ఇబ్బందులు
చింతపల్లి: జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం జిల్లావ్యాప్తంగా వీటి ప్రభావం కనిపించింది. జి.మాడుగులలో 3.2, డుంబ్రిగుడలో 3.6, అరకులోయలో 3.9, ముంచంగిపుట్టులో 4.4, హుకుంపేటలో 5.4, పాడేరులో 6.7, పెదబయలులో 7.1, వై.రామవరంలో 8.7, మారేడుమిల్లిలో 9.4 డిగ్రీల కనిష్టఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. దీంతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
జి.మాడుగుల: మండలంలో గురువారం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంలో చలితీవ్రతకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు చలి వణికించిందని వారు తెలిపారు. స్వెర్టర్లు, మంకీ క్యాప్‌లు ధరించి, రగ్గులు కప్పుకున్నా చలికి తాళలేకపోయామని వారు పేర్కొన్నారు. దీంతో ఇళ్ల వద్దనే కట్టెలతో మంటలు వేసుకుని, చలి నుంచి కొంతమేర ఉపశమనం పొందామని వారు తెలిపారు. ఈ ప్రాంతంలో 3.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉదయం 9 గంటల వరకు సూర్యోదయం కాలేదు.
మంచు గడ్డల సొలభం
సొలభం పంచాయతీలోని సొలభం, ఎస్.కొత్తూరు, భీమలోయ, తాసరిబయలు, వనభరంగిపాడు, వంజంగిపాడు తదితర గ్రామాల్లో మంచు వర్షం కురిసింది. మంచు బిందువులో గడ్డకట్టాయి. వరి కుప్పలపై కప్పిన పాలిథిన్ కవర్లపై మంచు గడ్డ రూపంలో పేరుకుపోయింది. మంచు దట్టంగా కురవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. వాహనాల హెడ్ లైట్ల వెలుగులో రాకపోకలు సాగించారు.


