ప్రమాదాలకు నిలయంగా హైవే
● మలుపుల్లో ఏర్పాటు చేయని
హెచ్చరిక బోర్డులు
● ముందు జాగ్రత్తలు చేపట్టని జాతీయ రహదారి నిర్మాణ అధికారులు
● వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆవేదన
పాడేరు రూరల్: ఏజెన్సీ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారిందని వైఎస్సార్ సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ విజయనగరం నుంచి అనంతగిరి, అరకులోయ, హుకుంపేట, పాడేరు మీదుగా రాజమహేంద్రవరం వరకు జరుగుతున్న హైవే పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. ఈ మార్గంలో పాడేరు–హుకుంపేట మధ్యలో ఏడాది వ్యవధిలో సుమారు 50కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు. వీటిలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రమాదాలు జరగకుండా హైవే అధికారులు మందు జాగ్రత్తలు చేపట్టకపోవడమే కారణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో జాతీయ రహదారిని ఆనుకుని మందుబాబుల ఆగడాలు పెరిగినప్పటికీ పోలీసు అధికారులు పెట్రోలింగ్ నిర్వహించడం లేదని ఆరోపించారు. పాడేరు నుంచి జిమాడుగుల, చింతపల్లి మీదుగా హైవే నిర్మాణ పనులు నత్తనడకను తలపిస్తున్నాయన్నారు. దుమ్ము, ధూళితో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారన్నారు. ఎక్కడ పడితే అక్కడ తవ్వి వదిలేయడం ప్రమాదాలకు ఆస్కారమిస్తోందన్నారు. ఇప్పటికై నా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని, హైవే పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.


